Telugu Global
Telangana

దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం..

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ. 500 పెన్షన్‌ తో సరిపెట్టాయని, స్వరాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులుంటే, అంతమందికి రూ.3016 పెన్షన్‌ అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నామని కేసీఆర్ చెప్పారు.

దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం..
X

దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు సీఎం కేసీఆర్. ఆ విషయంలో తెలంగాణకు కేంద్రం పలు అవార్డులు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల శాఖను ప్రత్యేక శాఖగా స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. ప్రపంచంలో సంపూర్ణ మానవుడంటూ ఎవరూ ఉండరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని తన సందేశాన్ని వినిపించారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఆత్మన్యూనతకు లోను కాకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆసరా అవసరమైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ. 500 పెన్షన్‌ తో సరిపెట్టాయని, స్వరాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులుంటే, అంతమందికి రూ.3016 పెన్షన్‌ అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నామని కేసీఆర్ చెప్పారు. దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితబంధు పథకాలతోపాటు ఇతర పథకాల్లో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాలలో 4 శాతం రిజర్వేషన్‌ అమలుచేస్తున్నామని వివరించారు.

పోటీ పరీక్షలకోసం ప్రిపేర్ అవుతున్న దివ్యాంగుల కోసం ఉచిత కోచింగ్‌ తోపాటు స్టడీ మెటీరియల్, ఉద్యోగ సర్వీసుల్లో ప్రత్యేక అలవెన్సులు, ఎకనామిక్ రిహాబిలిటేషన్ సెంటర్లు, దివ్యాంగుల సలహా మండలి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌ సైట్‌ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు సీఎం కేసీఆర్. దివ్యాంగులకు అవసరమైన వీల్‌ చైర్లు, త్రీ వీలర్ స్కూటీలు, చేతికర్రలు సమకూరుస్తూ అండగా నిలుస్తున్నామని చెప్పారు. దివ్యాంగులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌ షిప్‌ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. దివ్యాంగులను మనలో ఒకరిగా ఆదరించాలని, వారి సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర పిలుపునిచ్చారు.

First Published:  3 Dec 2022 7:33 PM IST
Next Story