పదేళ్ల తెలంగాణ దేశానికి ఆదర్శం ఎలా అయిందంటే..?
కేసీఆర్ దార్శనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో మార్పు స్పష్టంగా కనపడుతోంది. అభివృద్ధి, సంక్షేమాల్లో తెలంగాణ మోడల్ దేశమంతా చర్చించుకునేలా చేసింది.
2014 జూన్ 2కి ముందు తెలంగాణ ఓ ప్రాంతం..
ఆ తర్వాత తెలంగాణ ఓ అస్తిత్వం..
ఇప్పుడు దేశానికే తెలంగాణ ఆదర్శ రాష్ట్రం.
తొమ్మిదేళ్లు పూర్తై పదో ఏడులో అడుగుపెట్టే నాటికి ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది..? అప్పుడే పుట్టిన రాష్ట్రం అన్నప్రాసన రోజుకే ఆవకాయని ఆరగించే స్థితికి ఎలా చేరుకోగలిగింది. సీఎం కేసీఆర్ విజన్ తోనే అది సాకారమైంది. కేసీఆర్ దార్శనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో మార్పు స్పష్టంగా కనపడుతోంది. అభివృద్ధి, సంక్షేమాల్లో తెలంగాణ మోడల్ దేశమంతా చర్చించుకునేలా చేసింది. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా పయనం ప్రారంభమైంది. ఈ క్రమంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏంటి..? భావితరాలకు, ఇతర రాష్ట్రాలకు ఈ అభివృద్ధి ఎలాంటి పాఠాలు నేర్పిస్తోంది.. ఓసారి చూద్దాం.
కొత్త రాష్ట్రంలో ప్రజలు ఎన్నో అద్భుతాలు కోరుకుంటారు. పోరుబాటలో ప్రాణాలొడ్డి సాధించుకున్న తెలంగాణలో తమ ఉనికి ఉన్నతంగా ఉండాలనుకుంటారు. సరిగ్గా కేసీఆర్ అదే బాటలో ప్రయాణం మొదలు పెట్టారు. వినూత్న పథకాలతో ప్రజలకు చేరువయ్యారు, వారి జీవితాల్లో మార్పు తెచ్చారు.
రైతుబంధు, రైతు బీమా, బర్రెల పంపిణీ, గొర్రెల పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, దళిత బంధు వంటి అనేక పథకాలతో కేసీఆర్ పేదరికంపై యుద్ధం మొదలు పెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని స్కూల్స్, హాస్టల్స్ బాగుపడ్డాయి, వ్యవసాయం కొత్తపుంతలు తొక్కింది. గ్రామాల్లో కరెంటు కోతలు లేవు, ఫ్లోరైడ్ భూతం జాడే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదేళ్ల ముందు తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయంలో స్పష్టమైన తేడా కనపడుతోంది. 3.5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 44,12,882 మందికి ప్రతి నెల ఆసరా పెన్షన్లు అందుతున్నాయంటే ఇతర రాష్ట్రాలవారికి అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.
సంక్షేమానికి 5లక్షల కోట్లు..
ప్రతి ఏటా 50వేల కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమం కోసం కేటాయించింది. సంక్షేమంలో స్వర్ణయుగాన్ని స్థాపించింది. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు పెన్షన్లకోసం తెలంగాణకు కేటాయించిన నిధులు కేవలం రూ.5,558 కోట్లు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ప్రభుత్వం 2014 నుండి 2023 మధ్య తొమ్మిదేళ్ల కాలంలో ఆసరా తదితర పెన్షన్లకోసం రూ. 58,696 కోట్లు ఖర్చు చేసింది. గీత కార్మికులు, నేత కార్మికులు, బీడీ కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు.. ఇలా వివిధ కేటగిరీల కింద కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్లకు కొత్త పథకాలతో గొప్ప ఊరట లభించింది. హాస్టళ్లు, సంక్షేమ భవనాలు, చేతి వృత్తులవారికి ఆర్థిక భరోసా సహా అన్ని వర్గాల వారిని కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంది. అగ్రవర్ణ పేదలకు కూడా ఆర్థిక భరోసా ఇచ్చి తరతరాల నిర్లక్ష్యానికి సమాధానం చెప్పింది.
వ్యవసాయం
తెలంగాణ ఏర్పాటైన తర్వాత వ్యవసాయ రంగానికి మునుపెన్నడూ లేని కళ వచ్చింది. మిషన్ కాకతీయతో సాగునీరు రైతన్నకు భరోసా ఇచ్చింది. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న కాళేశ్వరంతో రైతుల కష్టాలు తీరిపోయాయి. రైతుబంధు, రైతు బీమాతో పంటనష్టం కారణంగా ఆత్మహత్య అనే మాటే వినపడకుండా పోయింది. తెలంగాణలో నీటి పారుదల రంగం అభివృద్ధితో ఆయకట్టు 119 శాతం పెరిగింది.
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి(2014) 700 ఎంబీబీఎస్ సీట్లతో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4440 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. తల్లిబిడ్డ సంక్షేమం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, బస్తీ దవాఖానాలు, ఉచిత డయాలసిస్ సెంటర్లు.. ఇలా వైద్యరంగంలో తెలంగాణ గత 9ఏళ్లలో గణనీయమైన మార్పు సాధించింది.
విద్య, ఉపాధి, విద్యుత్ రంగాల్లో కూడా స్వయం సమృద్ధి సాధించింది తెలంగాణ. నాణ్యమైన విద్య, ఇంగ్లిష్ మీడియం, గురుకులాలు, మనఊరు-మనబడి, రెసిడెన్షియల్ కాలేజీలు.. విద్యారంగంలో కేసీఆర్ తనదైన ముద్ర వేశారు. కొత్త రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు. తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. ఇప్పుడది 18,567 మెగావాట్లకు పెరిగింది.
ఐటీరంగంలో దూకుడు..
భారతదేశ సిలికాన్ వ్యాలీగా, ఐటీ క్యాపిటల్ గా ప్రసిద్ధిగాంచిన బెంగుళూరును అధిగమిచేం దిశగా తెలంగాణ ఐటీ రంగం నేడు దూసుకెళ్తోంది. 2013-14లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు. 2021-22నాటికి రూ.1,83,569 కోట్లకు పెరిగింది. ఐటీ ఉద్యోగాలు భారీగా పెరిగాయి, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కి క్యూ కడుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్ గా, దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ గా టి-హబ్ నిలిచింది. టి-వర్క్స్, వి-హబ్, ఫైబర్ గ్రిడ్ పథకం.. తెలంగాణ ఉపాధి రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఐటీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో అంతర్జాతయ కంపెనీలన్నీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆఫీస్ ల ఏర్పాటుకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్ గా మార్చుకుంటున్నాయి.
ప్రతి రంగంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ పోలీస్ వినూత్న ఆవిష్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. హరితహారంతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. అమరవీరుల స్మృతి వనం, దేశంలోనే అతి పెద్దదైన 125అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ పేరిట వెలసిన నూతన సచివాలయం.. తెలంగాణ ప్రభుత్వం ఏది మొదలు పెట్టినా, దేశంలోనే గొప్పగా ఉండేలా అవి పూర్తయ్యాయి. పరిశ్రమలు, రవాణా, క్రీడలు.. అన్ని రంగాల్లోనూ తెలంగాణ తన ఉనికి చాటుకుంటోంది, దేశానికి ఆదర్శ రాష్ట్రంగా మారింది.