అమెరికాలో తెలంగాణ విజయ గాథ..
రాబోయే ఐదు తరాలకు హైదరాబాద్ కి మంచినీటి కొరత లేకుండా చేశామన్నారు మంత్రి కేటీఆర్. మిషన్ భగీరథ మంచినీటి సరఫరా ద్వారా అంటువ్యాధులనేవి చరిత్రగా మారిపోయాయని చెప్పారు.
9 ఏళ్లలో తెలంగాణ సాధించిందేంటి..? ఎలా సాధించగలిగింది..? దేశానికే ఆదర్శంగా ఎలా మారింది..? అమెరికా వేదికగా సవివరంగా తెలంగాణ విజయాలను వినిపించారు మంత్రి కేటీఆర్. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయగాథలను వివరించారు. గోదావరి జలాలను తెలంగాణ ఎలా ఒడిసిపట్టిందో, తాగునీరు, సాగునీటిని ఎంత సమర్థంగా ఉపయోగించుకుందనే విషయాలను తెలియజేశారు. కాళేశ్వరం ఒక ఇంజినీరింగ్ అద్భుతమని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దార్శనికతకు అది నిదర్శనం అని చెప్పారు.
అమెరికాలోని నెవాడాలో జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE)- వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆయనే ప్రారంభోపన్యాసం చేశారు. వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను అమెరికా ఇంజినీరింగ్ నిపుణులు, సామాజికవేత్తలు, పరిశ్రమవర్గాలకు వివరించారు. ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు.
Telangana Success Stories on a Global Dias! Minister @KTRBRS speaking at the World Environmental and Water Resources Congress - 2023 held in Nevada, USA by American Society of Civil Engineers (@ASCE_EWRI) #TriumphantTelangana https://t.co/tpjwD05VTN
— BRS Party (@BRSparty) May 22, 2023
తెలంగాణ ఏర్పాటుకి ముందు సరైన ప్రాజెక్ట్ లు లేక ప్రజలు, రైతులు కష్టాలు ఎదుర్కొన్నారని.. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లం నుంచి ఎత్తుకు గోదావరి నదీ జలాలను ఎత్తిపోశామని, సీఎం కేసీఆరే ఇంజినీర్ గా మారి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరానికి రూపకల్పన చేశారని వివరించారు. కాల్వల నిర్మాణం, పంప్ హౌస్ లు, సర్జ్ పూల్ లు, ప్రాజెక్టులో వినియోగించిన స్టీల్ తదితర అంశాలను వివరించారు కేటీఆర్. రాబోయే ఐదు తరాలకు హైదరాబాద్ కి మంచినీటి కొరత లేకుండా చేశామన్నారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరా ద్వారా అంటువ్యాధులనేవి చరిత్రగా మారిపోయాయని చెప్పారు. మిషన్ భగీరథలో ట్రీట్ చేసిన నీటినే ప్రపంచ ప్రఖ్యాత కోకాకోలా సంస్థ ఉపయోగించుకుంటోందని తెలిపారు మంత్రి కేటీఆర్.
తెలంగాణలో పెరిగిన మత్స్య సంపద, పాల ఉత్పత్తి, ఆయిల్ పామ్ సాగు, గొర్రెల పంపిణీతో పెరిగిన మాంసం ఉత్పత్తులు.. వంటి వివరాలను తన ప్రజెంటేషన్లో పొందుపరిచారు మంత్రి కేటీఆర్. తెలంగాణను సందర్శించి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడాలని అక్కడివారిని ఆహ్వానించారు.