మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు
మహిపూర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తమ పిల్లలను ఆ రాష్ట్రం నుంచి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఇంపాల్ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆదివారమే విద్యార్థులను ఇంపాల్ నుంచి శంషాబాద్ తీసుకొని రావడానికి ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో విమాన ప్రయాణాన్ని సోమవారానికి వాయిదా వేశారు.
మహిపూర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి ఐఐటీతో పాటు ఇతర విద్యా సంస్థల్లో చదువుతున్న తెలంగాణ వారిని సురక్షితంగా తీసుకొని వచ్చారు. ఇప్పటికే బాధితుల సహాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మణిపూర్‌లోని ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడిన తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్.. విద్యార్థుల ప్రయాణంపై సమీక్ష చేశారు. దాదాపు 250 మంది విద్యార్థులను ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ తీసుకొని వచ్చారు.
హైదరాబాద్ వచ్చిన విద్యార్థులను ప్రత్యేక బస్సుల ద్వారా స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాటు చేశామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. వారి చదువులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మణిపూర్‌లో పరిస్థితులు చక్కబడకపోతే.. తెలంగాణలోనే వారి చదువులు కొనసాగేలా ఏర్పాటు చేస్తామని.. ఏ విద్యార్థి కూడా నష్టపోకుండా చూస్తామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.