Telugu Global
Telangana

మోదీకి గుండు గీకి సున్నం పెడతాం –విద్యార్థి జేఏసీ వార్నింగ్

సీఎం కేసీఆర్ ను ఏమీ చేయలేక తెలంగాణకు నష్టం చేయడానికి గవర్నర్ ను కేంద్రం శిఖండిలా వాడుకుంటోందని అన్నారు విద్యార్థి జేఏసీ నాయకులు. వెంటనే గవర్నర్ ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.

మోదీకి గుండు గీకి సున్నం పెడతాం –విద్యార్థి జేఏసీ వార్నింగ్
X

ఈనెల 12న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. రామగుండంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారని రాష్ట్ర బీజేపీ ఘనంగా ప్రకటించుకుంటోంది. అయితే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న మోదీ, పాతవాటిని ప్రారంభిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని విద్యార్థి జేఏసీ నాయకులు మండిపడ్డారు. తెలంగాణ యూనివర్శిటీ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే రామగుండంలో మోదీకి గుండు గీకి సున్నం పెడతామని హెచ్చరించారు.

తెలంగాణ యూనివర్శిటీల కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడాన్ని యూనివర్శిటీ విద్యార్థి జేఏసీ తీవ్రంగా తప్పుబట్టింది. బిల్లుని తొక్కిపెట్టాలని గవర్నర్ కి చెప్పింది కేంద్రమా లేక మోదీయా అనే విషయం బయటపెట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థి నేతలు. తక్షణమే యూనివర్శిటీల కామన్ రిక్రూట్ మెంట్ బిల్లును బేషరతుగా ఆమోదించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను అడ్డుకుంటూ తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుని గవర్నర్ ఆమోదించకపోవడం సరికాదన్నారు.

దూడను చీకమని, బర్రెను తన్నమని ఎగేస్తున్న మోదీ, తెలంగాణ ప్రగతి విఘాతకుడంటూ మండిపడ్డారు విద్యార్థి నేతలు. "తెలంగాణ కోసం నాడు కేంద్రం మెడలు వంచినోల్లం.. నేడు నిన్ను గద్దె దించడం ఖాయం చూస్కో మా తడాఖా" అంటూ హెచ్చరించారు. "అణచివేతను ఎదుర్కోవడం ఆఖరిది కాదు, కొట్లాట మాకు కొత్తకాదు" అని అన్నారు. కేసీఆర్ పై తెలంగాణ ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్న మోదీ రంగు బయటపడే రోజొచ్చిందని, తెలంగాణ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే తట్టుకోలేక మోదీ తలతిక్క చేష్టలు చేస్తున్నారని అన్నారు విద్యార్థి నాయకులు.

గవర్నర్ ఓ శిఖండి.. వెంటనే రీకాల్ చేయాలి..

సీఎం కేసీఆర్ ను ఏమీ చేయలేక తెలంగాణకు నష్టం చేయడానికి గవర్నర్ ను కేంద్రం శిఖండిలా వాడుకుంటోందని అన్నారు విద్యార్థి జేఏసీ నాయకులు. గవర్నర్ ను రాజ్యాంగేతర శక్తిగా మార్చి తెలంగాణ ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తెలంగాణ ద్రోహి మోదీ అంటూ మండిపడ్డారు. వెంటనే గవర్నర్ ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తూ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ నాయకురాలు గవర్నర్ గా కొనసాగడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లవుతున్నా, కేంద్రం సాయం గుండు సున్నా అని విమర్శించారు.

First Published:  8 Nov 2022 3:03 PM IST
Next Story