Telugu Global
Telangana

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ డీపీఆర్ కేంద్రం తిరస్కరించడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం

పీఆర్ఎల్ఐఎస్‌కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను కేంద్రానికి పంపగా.. పలు అంశాలను కారణాలుగా చూపుతూ తిరస్కరించింది. ప్రాజెక్టుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ డీపీఆర్ కేంద్రం తిరస్కరించడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం
X

పాలమూరు ప్రాంతం అంటేనే కరువుకు నిలయంగా పేరున్నది. దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ జిల్లాల్లో కరువు పీడిత, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌(పీఆర్ఎల్ఐఎస్)కు కేంద్రం నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టు సాకారం అయితే ఆరు జిల్లాల్లోని 1200 గ్రామాలకు తాగునీరు, 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే ప్రాజెక్టు అనుమతుల విషయంలో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగింది.

పీఆర్ఎల్ఐఎస్‌కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను కేంద్రానికి పంపగా.. పలు అంశాలను కారణాలుగా చూపుతూ తిరస్కరించింది. ప్రాజెక్టుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వెంటనే డీపీఆర్‌ను పరిశీలించి తగిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ను పరిశీలించి అనుమతి ఇచ్చేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌కు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు.

గతంలో సీడబ్ల్యూసీ లేవనెత్తిన సమస్యలన్నింటికీ సవివరంగా వివరణ ఇచ్చామని.. అందు వల్ల మరోసారి డీపీఆర్‌ను పరిశీలించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రజత్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్.. ఈ అంశంపై తీర్పు ఇచ్చేంత వరకు డీపీఆర్‌ను పరిశీలించబోమని సీడబ్ల్యూసీ అనడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో తమకు అధికారం లేదని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గతంలోనే చెప్పారని లేఖలో గుర్తు చేశారు. డీపీఆర్‌ను పరిశీలించి ట్రిబ్యునల్ తుది తీర్పుకు లోబడి అనుమతులు ఇవ్వాలని లేఖలో కోరారు.

2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం.. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చారని.. ఆరు నెలల్లో అనుమతులు పొందాలని చెప్పారు. అందుకే అనుమతుల కోసం డీపీఆర్ సమర్పించాము. ఆరు నెలల్లోగా డీపీఆర్ పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.

సీడబ్ల్యూసీ మాత్రం ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్ ఉన్నందున డీపీఆర్ పరిశీలించలేమని చెప్పడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. ఒక వైపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదు.. అదే సమయంలో ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు మాత్రం అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా.. జాతీయ హోదా కూడా కల్పించి రూ.5,300 కోట్లు కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని తెలంగాణ గుర్తు చేసింది.

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలను ఎలా విధించిందని రజత్ కుమార్ లేఖలో కేంద్రాన్ని ప్రశ్నించారు. కావాలనే తెలంగాణను ఇరుకున పెట్టడానికి ఇలాంటి నిబంధనలు పెడుతూ తాత్సరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్వయంగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని.. ఇప్పడు మాత్రం అనుమతులే రాకుండా మోకాలడ్డుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

First Published:  19 April 2023 4:56 PM IST
Next Story