Telugu Global
Telangana

తెలంగాణ పోలీస్ జిందాబాద్.. ఆ విషయంలో మనమే నెంబర్-1

తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలోకూడా తెలంగాణ పోలీస్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందన్నారు అధికారులు. తప్పిపోయిన పిల్లలలో 96శాతం మందిని తిరిగి గుర్తించామని, దేశంలోనే ఇది అత్యథిక శాతం అని చెప్పారు.

తెలంగాణ పోలీస్ జిందాబాద్.. ఆ విషయంలో మనమే నెంబర్-1
X

తెలంగాణ ఇప్పటికే చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్-1 స్థానంలో ఉంది. శాంతి భద్రతల విషయంలో కూడా ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం. తెలంగాణ ఏర్పాటు చేసిన షి-టీమ్స్ ని ఆ తర్వాత చాలా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక మానవ అక్రమ రవాణా కట్టడిలో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 స్థానంలో ఉందని తెలిపారు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్. ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా ఉందని, దాన్ని కట్టడి చేయడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అవ‌తరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగం, 'బచ్‌ పన్‌ బచావో ఆందోళ‌న్‌' స్వచ్ఛంద సంస్థ స‌హ‌కారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ, పునరావాసంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఈ సదస్సుకి డీజీపీ అంజ‌నీ కుమార్ ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ని అరికట్టేందుకు పోలీస్ శాఖకు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా అవసరమని చెప్పారాయన.

మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మహిళా భద్రతా విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని తెలిపారు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్. అన్ని జిల్లాల్లో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు పనిచేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మానవ అక్రమ రవాణా పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనుసరిస్తోందని చెప్పారు. గత రెండేళ్లలో 738 కేసులు నమోదుచేసి, 1961 మంది నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. 110 మంది నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు.

తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలోకూడా తెలంగాణ పోలీస్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందన్నారు అధికారులు. తప్పిపోయిన పిల్లలలో 96శాతం మందిని తిరిగి గుర్తించామని, దేశంలోనే ఇది అత్యథిక శాతం అని చెప్పారు. ప్రొఫెషనల్ డేటా మేనేజ్‌మెంట్ ద్వారా ట్రాఫికింగ్ నెట్‌ వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రత్యేక మెకానిజంను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో పోలీస్, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

First Published:  6 Jun 2023 8:10 PM IST
Next Story