Telugu Global
Telangana

స్వచ్ఛతా హి సేవలో తెలంగాణ టాప్

చెత్తరహిత భారత్‌ అనే ఇతివృత్తంతో శ్రమదానంతో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో తెలంగాణది మొదటి స్థానం. విశేషం ఏంటంటే.. టాప్‌ 10 రాష్ట్రాల్లో మూడు మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రాలున్నాయి.

స్వచ్ఛతా హి సేవలో తెలంగాణ టాప్
X

తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించింది. పరిశుభ్రతా కార్యక్రమాల్లో రాష్ట్రం టాప్‌ ప్లేస్ లో నిలిచింది. స్వచ్ఛతా హి సేవ(SHS)లో తెలంగాణ మొదటి స్థానం సాధించింది. SHSలో భాగంగా 33,764 కార్యక్రమాలు తెలంగాణలో జరిగాయి. మిగతా రాష్ట్రాల్లో కనీసం 10వేలు కూడా జరగలేదంటే తెలంగాణ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాల్లో ప్రజల ప్రాతినిధ్యంలో కూడా తెలంగాణ నెంబర్-1 స్థానంలో ఉంది. తెలంగాణ నుంచి 20.48శాతం మంది SHSలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని నెంబర్-1 స్థానంలో నిలిపారు. తెలంగాణ తర్వాత కర్నాటక, బీహార్, లక్షద్వీప్, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

స్వచ్ఛత వాక్‌, స్వచ్ఛత ర్యాలీ, సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై సంతకాల సేకరణ, స్వచ్ఛత ప్రతిజ్ఞ, మానవహారం తదితర కార్యక్రమాలను SHSలో భాగంగా చేపట్టారు. గ్రామాల్లోని అన్ని ముఖ్యమైన ప్రదేశాల నుంచి చెత్తను తొలగించడం, చెత్తకుండీల శుభ్రత, పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ, చెత్త వాహనాలను శుభ్రంగా ఉంచడం, పెయింటింగ్‌, బ్రాండింగ్‌ తదితర కార్యక్రమాలు తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో అద్భుతంగా జరిగాయి. అందుకే ఈ గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కేంద్ర జల్‌ శక్తి శాఖ.. తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక మార్కులు కేటాయించింది.

చెత్తరహిత భారత్‌ అనే ఇతివృత్తంతో శ్రమదానంతో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. వీటిని ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణది మొదటి స్థానం. విశేషం ఏంటంటే.. టాప్‌ 10 రాష్ట్రాల్లో మూడు మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రాలున్నాయి. స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌ లో భాగంగా ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 2 వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని చేపడతారు. SHSలో మొదటి స్థానంలో ఉన్న ఉత్సాహంతో ఈ ఏడాది తెలంగాణలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

First Published:  24 Sept 2023 6:00 AM IST
Next Story