సమస్యల పరిష్కారంలో తెలంగాణ టాప్..
గతంలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ, మే నెల నివేదికలోనూ మొదటి స్థానంలో నిలిచింది. 2,524 పిటిషన్లను 8 రోజుల అతి తక్కువ వ్యవధిలో పరిష్కరించగలిగింది.
అద్భుతమైన పాలనలో కూడా ప్రజలకు కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటి పరిష్కారం కోసం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటాయి స్థానిక ప్రభుత్వాలు. అయితే ఆ పరిష్కార క్రమంలో అధికారులు చూపించే చొరవ, నాయకులు ఫాలో అప్ అనేవి చాలా ముఖ్యం. అలాంటి అంశాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ఏమిటీ నివేదిక..?
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు జాతీయస్థాయిలో సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టం (CPGRAMS) పేరుతో ఆన్ లైన్ పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. సామాన్యులెవరైనా ఈ పోర్టల్ లో ఫిర్యాదులు చేయొచ్చు. వాటన్నిటినీ ఆయా రాష్ట్రాలకు పంపించి పరిష్కరించాలని కోరుతుంది కేంద్రం. దీనికోసం రాష్ట్రాల్లో గ్రీవెన్స్ రిడ్రెస్ ఆఫీసర్స్(GRO) ఉంటారు. వారు ఆయా సమస్యలను ఎంత వేగంగా పరిష్కరించారు, ఎన్నిటిని పరిష్కరించారు అనే లెక్కలు తీసి వాటిని నివేదికల రూపంలో విడుదల చేస్తుంటారు. ఇలా విడుదలైన నివేదికలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
గతంలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ, మే నెల నివేదికలోనూ మొదటి స్థానంలో నిలిచింది. 2,524 పిటిషన్లను 8 రోజుల అతి తక్కువ వ్యవధిలో పరిష్కరించగలిగింది. 15వేల లోపు ఉన్న రాష్ట్రాలను గ్రూప్-డి కేటగిరీ కింద విభజించి ర్యాంకులు ఇచ్చింది కేంద్రం. అందులో తెలంగాణకు 72.49 స్కోర్ తో మొదటి ర్యాంక్ రాగా, లక్షద్వీప్ రెండో స్థానంలో ఉంది. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం ఏపీ పదో స్థానంలో ఉండటం విశేషం. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా పిటిషన్లు వచ్చాయి. ఆ తర్వాత జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువ పిటిషన్లు వచ్చాయి.