Telugu Global
Telangana

మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి.. గాయకులకు కూడా అవమానమేనా..?

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడేవారంతా కీరవాణి టీమ్ నుంచే ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న గాయకులకు అవకాశం లేకుండా పోయింది.

మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి.. గాయకులకు కూడా అవమానమేనా..?
X

తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం సమకూర్చే విషయంలో ఓవైపు రచ్చ జరుగుతుంటే.. దానికి కొనసాగింపుగా సీఎం రేవంత్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర గీతం విషయంలో తెలంగాణ గాయకులకు కూడా అవమానం జరిగేలా కనపడుతోంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడేవారంతా కీరవాణి టీమ్ నుంచే ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న గాయకులకు అవకాశం లేకుండా పోయింది.

మ్యూజిక్ సిట్టింగ్స్..

అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కీరవాణి టీమ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ ఫైనల్ మ్యూజిక్ సిట్టింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ తదితరులు కూడా ఈ సంగీత చర్చల్లో పాల్గొన్నారు.


రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితోపాటు.. కీరవాణి టీమ్ లోని గాయకులు కూడా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కి హాజరయ్యారు. అంటే ఈ పాటను కీరవాణి టీమ్ లోని గాయకులే పాడతారని స్పష్టమవుతోంది. ఇక్కడ కూడా తెలంగాణ గాయకులకు అన్యాయం జరిగిందనే వాదన వినపడుతోంది.

డోంట్ కేర్..

తెలంగాణ రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గేలా లేదు. రాష్ట్ర చిహ్నంలో మార్పులను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ కూడా ఈ వ్యాఖ్యలకు అంతే ఘాటుగా బదులిచ్చింది. రాష్ట్ర చిహ్నంలో త్యాగాల తాలూకు ఆనవాళ్లు కనపడాలి కానీ, రాచరికపు ఆనవాళ్లు కాదంటూ.. కాంగ్రెస్ టీమ్ సోషల్ మీడియాలో ఎదురుదాడి మొదలు పెట్టింది.



First Published:  30 May 2024 8:01 AM IST
Next Story