Telugu Global
Telangana

తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

మారుతున్న కాలాన్ని బట్టి అత్యాధునిక సాంకేతికతను మనం అడాప్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
X

తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఐటీ విభాగంలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో టీ-హబ్‌లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కింద 8 టెక్నాలజీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. 2018 నుంచి వరుసగా బ్లాక్ చైన్, డ్రోన్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్, స్పేస్‌టెక్‌లకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించాము. ఇక ఆరవ టెక్నాలజీగా రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించామని కేటీఆర్ అన్నారు.

మారుతున్న కాలాన్ని బట్టి అత్యాధునిక సాంకేతికతను మనం అడాప్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమని మంత్రి అన్నారు. రోబోటిక్స్ టెక్నాలజీ ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ మెట్రొపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులతో మాట్లాడాను. మ్యాన్‌హోల్ క్లీనింగ్స్ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపుల్లోకి వెళ్లి అక్కడి సమస్యను గుర్తించడానికి రోబోట్లను ఎందుకు వాడకూడదు అని ప్రశ్నించాను. అధికారులు కూడా అది సరైన ఆలోచనగా చెప్పారు. వరదలు వచ్చినప్పుడు ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడం చూస్తున్నాము. ఆస్తులు ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ, ప్రాణాలు తీసుకొని రాలేము. అలాంటి విపత్కర సమయాల్లో రోబోట్ల వాడకం ఎంతగానో మేలు చేస్తుందని కేటీఆర్ అన్నారు.

క్లిష్టమైన ఆపరేషన్లను కూడా రోబోటిక్స్ ద్వారా సులభంగా చేయవచ్చు. ముఖ్యంగా ఎవరైనా నిపుణుడైన డాక్టర్ ప్రపంచంలో ఏ మూల ఉన్నా.. రోబోను గైడ్ చేస్తూ ఇక్కడ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో రంగాల్లో రోబోటిక్స్ అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఇటీవల వరంగల్‌లోని కిట్స్ కాలేజీకి వెళ్లాను. అక్కడి విద్యార్థుల ఆలోచనలు చూసి ఆశ్చర్యం వేసింది. పంట పొలాల్లో ఉపయోగించడానికి డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను రూపొందించారు. ఇండియాలోని రోడ్లపై ఆటోమేటిక్ కార్లను తీసుకొని రావడం కొంచెం కష్టమైన విషయమే.. కానీ పొలాల్లో ఇలాంటి ట్రాక్టర్లతో పని చేయించడం సులభం అవుతుందని కేటీఆర్ అన్నారు.

ఇప్పుడు ఆవిష్కరించిన రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ కారణంగా ఈ రంగంలో రాష్ట్రం ఒక లీడర్‌గా ఎదుగుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రోబోటిక్స్ ఇండస్ట్రీకి ఇది ఊతం ఇస్తుందని కేటీఆర్ అన్నారు. ఎంతో మంది నూతన ఆవిష్కర్తలకు ఈ ఫ్రేమ్ వర్క్ ఉపయోగపడుతుందని, మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి అనుకూలంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అక్కడకు తీసుకొని వచ్చిన రోబో.. మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు చెప్పడం విశేషం.


First Published:  9 May 2023 5:35 PM IST
Next Story