రైతుబంధు, రుణమాఫీపై సీఈవో కీలక ప్రకటన
2018లో లక్ష రూపాయలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా రుణమాఫీ ఆలస్యమవుతూ వచ్చింది.
రైతుబంధు, రుణమాఫీ నిధుల విడుదలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరుపై కీలక ప్రకటన చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. రైతుబంధు, రుణమాఫీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరుపై ప్రభుత్వంపై విజ్ఞప్తి చేసిందని చెప్పారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని.. నిర్ణయం రాలేదని స్పష్టంచేశారు.
2018లో లక్ష రూపాయలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా రుణమాఫీ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో పంట రుణాల మాఫీ ప్రారంభించినప్పటికీ.. మరో రూ.3 వేల కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో మిగిలిన నిధుల విడుదలకు బ్రేక్ పడింది.
ఇక యాసంగి పంటకు సంబంధించి రైతుబంధు నిధుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రైతుబంధు నిధులు నవంబర్‌లోనే విడుదల చేస్తామని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఫిర్యాదు వల్లే రైతుబంధు నిధుల విడుదలను ఎన్నికల కమిషన్ అడ్డుకుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.