Telugu Global
Telangana

ఆవిషయంలో తప్పు బ్యాంకుదే.. వినియోగదారుల కమిషన్ చీవాట్లు

బాధితుడు హైదరాబాద్ లో ఉన్నాడు, లావాదేవీ విదేశాల్లో జరిగింది. కనీసం అప్పుడైనా బ్యాంక్ అలర్ట్ అయ్యుండాల్సిందని, మిగతా లావాదేవీలు జరక్కుండా అడ్డుకుని ఉండాల్సిందని చెప్పింది కమిషన్.

ఆవిషయంలో తప్పు బ్యాంకుదే.. వినియోగదారుల కమిషన్ చీవాట్లు
X

ఖాతాదారుడికి తెలియకుండా ఆన్ లైన్ లావాదేవీలు జరిపినప్పుడు.. తప్పంతా బాధితుడిపై నెట్టేయడానికి ఆస్కారం లేదని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డ్ లావాదేవీల విషయంలో తప్పంతా బాధితుడిపై వేసి బిల్లు కట్టాలంటూ ఒత్తిడి చేసిన యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యానికి చీవాట్లు పెట్టింది. బాధితుడికి రూ.30 వేలు పరిహారం, రూ.5 వేలు ఖర్చుల కింద చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్‌ కు చెందిన సత్యనారాయణ రూ.1.22 లక్షల గరిష్ట పరిమితితో 2013లో యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు తీసుకున్నారు. 2015 ఆగస్టు 26న ఆయన ప్రమేయం లేకుండానే విదేశాల్లో రూ.83,814 మొత్తానికి 4 లావాదేవీలు జరిగాయి. ఇందులో ఒకటి క్యాన్సిల్ కాగా మిగతావి సక్సెస్ అయ్యాయి. అయితే వెంటనే అప్రమత్తమైన సత్యనారాయణ బ్యాంక్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ క్యాన్సిల్ చేయాలని కోరాడు. కానీ బ్యాంక్ లైట్ తీసుకుంది. నెలవారీ బిల్లులో రూ.83,814 కట్టాల్సిందేనంటూ నోటీస్ పంపించింది. సత్యనారాయణ కుదరదన్నాడు. కార్డు రద్దు చేయడంతోపాటు పదే పదే నోటీసులు పంపించింది బ్యాంక్. దీంతో సత్యనారాయణ జిల్లా వినియోగదారుల కమిషన్ ని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో యాక్సిస్ బ్యాంక్ రాష్ట్ర కమిషన్ ని ఆశ్రయించింది. తాజాగా రాష్ట్ర కమిషన్ కూడా అదే తీర్పు వెలువరించింది. యాక్సిస్ యాజమాన్యానికి చీవాట్లు పెట్టింది.

తప్పు సరిచేయాలి కదా..!

బాధితుడు హైదరాబాద్ లో ఉన్నాడు, లావాదేవీ విదేశాల్లో జరిగింది. కనీసం అప్పుడైనా బ్యాంక్ అలర్ట్ అయ్యుండాల్సిందని, మిగతా లావాదేవీలు జరక్కుండా అడ్డుకుని ఉండాల్సిందని చెప్పింది కమిషన్. బాధితుడు వెంటనే ఫోన్లో ఫిర్యాదు చేసిన తర్వాత అయినా బ్యాంక్ అప్రమత్తమై ఆ లావాదేవీలను నిలిపివేయాల్సిందని, కానీ అలా చేయకుండా బ్యాంక్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు, బాధితుడైన తమ ఖాతాదారుడిని ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొంది. తప్పుడు లావాదేవీలు జరక్కుండా అడ్డుకోవడం చేతకానప్పుడు కనీసం బాధితుడు నిమిషాల వ్యవధిలో స్పందించినా కూడా బ్యాంక్ అప్రమత్తం కాకపోవడం తప్పేనని స్పష్టం చేసింది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

First Published:  5 March 2023 8:18 AM IST
Next Story