Telugu Global
Telangana

బతుకమ్మ పండుగ ఎలా జ‌రుపుకోవాలంటే..

భాద్రపద అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కోరోజు ఒక్కో బతుకమ్మను పేరుస్తూ వేర్వేరు నైవేద్యాలతో అమ్మవారిని కొలుస్తారు.

Bathukamma festival in Telangana
X

బతుకమ్మ పండుగ ఎలా జ‌రుపుకోవాలంటే

తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణలో బతుకమ్మను పెద్ద పండుగగా జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కోరోజు ఒక్కో బతుకమ్మను పేరుస్తూ వేర్వేరు నైవేద్యాలతో అమ్మవారిని కొలుస్తారు.

మొదటిరోజు

బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్యతో మొదలవుతుంది. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మ తయారుచేస్తారు. తొలిరోజు బతుకమ్మను 'ఎంగిలిపూల‌ బతుకమ్మ' అంటారు. ఈ రోజున అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు.

రెండోరోజు

రెండో రోజు బతుకమ్మను 'అటుకుల బతుకమ్మ' అంటారు. ఇది ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున అమ్మకు చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు.. వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు.

మూడోరోజు

మూడోరోజు బతుకమ్మను 'ముద్దపప్పు బతుకమ్మ' అంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలను అమ్మకు నైవేద్యంగా పెడతారు.

నాలుగోరోజు

నాలుగో రోజు బతుకమ్మను 'నానబియ్యం బతుకమ్మ' అంటారు. ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం.. వంటివి అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

ఐదో రోజు

ఐదోరోజు బతుకమ్మను 'అట్ల బతుకమ్మ' అంటారు. ఈ రోజున అట్లు(దోశెలు) తయారు చేసి అమ్మకు నైవేద్యంగా పెడతారు.

ఆరో రోజు

ఆరో రోజు బతుకమ్మను 'అలిగిన బతుకమ్మ' అంటారు. ఈ రోజున బతుకమ్మ ఆడరు. అలాగే అమ్మ కోసం ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు.

ఏడోరోజు

ఏడో రోజు బతుకమ్మను 'వేపకాయల బతుకమ్మ' అంటారు.ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నైవేద్యంగా పెడతారు.

ఎనిమిదో రోజు

ఎనిమిదో రోజు బతుకమ్మను 'వెన్నముద్దల బతుకమ్మ' అంటారు. ఈ రోజున నువ్వులు, వెన్నముద్ద, బెల్లం.. వంటి పదార్థాలను అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

తొమ్మిదో రోజు

తొమ్మిదో రోజు దుర్గాష్టమి రోజున చేసే బతుకమ్మను 'సద్దుల బతుకమ్మ' అంటారు. దీన్నే 'పెద్ద బతుకమ్మ' అని కూడా పిలుస్తారు. ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ.. ఇలా అన్నిరకాల బతుకమ్మలను పేర్చి.. పాటలతో మహిళలంతా పెద్ద ఎత్తున బతుకమ్మ ఆట ఆడుకుంటారు. ఈ రోజున పెరుగన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి.. లాంటి వాటిని అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

First Published:  26 Sept 2022 7:18 PM IST
Next Story