Telugu Global
Telangana

తెలంగాణ: రూ.15,000 కోట్లు దాటనున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం

ఒక్క డిసెంబరులోనే రెవెన్యూ వసూళ్లు రూ.1,100 కోట్లు దాటగా, రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతున్న వేగాన్ని బట్టి మార్చి చివరి నాటికి రూ.15,000 కోట్లను సులభంగా దాటవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

తెలంగాణ: రూ.15,000 కోట్లు దాటనున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం
X

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే సమయానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా తెలంగాణ ఆదాయం 40 శాతం పెరిగి రూ.9,531 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13 వేల కోట్ల అంచనా లక్ష్యం కంటే చాలా ఎక్కువగా రూ.15 వేల కోట్లకు పైగా వసూళ్లు రావచ్చని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.

అధికారుల లెక్కల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.12,364 కోట్లు కాగా, ప్రస్తుత సంవత్సరంలో ఇది ఇప్పటికే రూ.9,531 కోట్లు దాటింది. ఒక్క డిసెంబరులోనే రెవెన్యూ వసూళ్లు రూ.1,100 కోట్లు దాటగా, రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతున్న వేగాన్ని బట్టి మార్చి చివరి నాటికి రూ.15,000 కోట్లను సులభంగా దాటవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14.54 లక్షల ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 5.63 లక్షలు (39 శాతం) వ్యవసాయ ఆస్తులు కాగా, 8.91 లక్షలు (61 శాతం) వ్యవసాయేతర ఆస్తులు. ఒక్క డిసెంబర్‌లోనే అత్యధికంగా 1.09 లక్షల వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.

డిసెంబర్ 31 వరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.7,944 కోట్లు, వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.1,587 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ వల్ల‌ జనవరి 21 నాటికి రూ..8,473 కోట్ల ఆదాయం వచ్చింది.

అన్ని రకాల ఆస్తుల విక్రయాలు, కొనుగోలులో పెరుగుదల మాత్రమే కాకుండా, ఆస్తుల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల కూడా ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం భూముల విలువలను పెంచింది, అయితే భూముల విలువలను పెంచిన తర్వాత కూడా ప్రతి నెల సగటున రూ.1,000 కోట్ల ఆదాయం వస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్‌పేట్, ఖాజాగూడ రంగారెడ్డి జిల్లా ప్రాంతాల నుండి ఆదాయంలో ఎక్కువ భాగం వస్తుంది.

First Published:  23 Jan 2023 5:50 AM GMT
Next Story