నిన్న సీఎం సెక్యూరిటీ.. నేడు సెక్రటేరియట్
సెక్యూరిటీ విధుల నుంచి స్పెషల్ పోలీసులను తప్పించిన రేవంత్ సర్కార్
తెలంగాణ స్పెషల్ పోలీసుల (టీజీఎస్‌పీ)పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. సీఎం సెక్యూరిటీ విధుల నుంచి ఇప్పటికే స్పెషల్ పోలీసులను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ సెక్రటేరియట్ సెక్యూరిటీ బాధ్యతల నుంచి కూడా స్పెషల్ పోలీసులను తప్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హోం శాఖ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. డ్యూటీ చార్ట్ లో మార్పులను నిరసిస్తూ స్పెషల్ పోలీసులు కొంతకాలంగా ఆందోళన బాట పట్టారు. తమ భర్తలు కుటుంబాలకు దగ్గర ఉంటూ డ్యూటీ చేసుకునే సౌలభ్యం కల్పించాలని కోరుతూ స్పెషల్ పోలీసుల భార్యలు ఆందోళనకు దిగారు. ధర్నా చౌక్ లో ఆందోళన చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలువురు స్పెషల్ పోలీసులను సస్పెండ్ చేసింది. ఆ వెంటనే సీఎం సెక్యూరిటీ నుంచి స్పెషల్ పోలీసులను తప్పించింది. సెక్రటేరియట్ భద్రత విధుల నుంచి కూడా స్పెషల్ పోలీసులను తప్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సీఎస్ శాంతికుమారి జీవో ఎం.ఎస్.ఎం.227 జారీ చేశారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్‌పీఎఫ్) ఎయిర్ పోర్టులు, పరిశ్రమలు, ముఖ్యమైన భవనాల భద్రతలో ప్రత్యేక శిక్షణ పొంది ఉంటుంది కాబట్టి సెక్రటేరియట్ భద్రత విధులను టీజీఎస్‌పీఎఫ్ పోలీసులకు అప్పగించాలని డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని, వాటిని క్షుణ్నంగా పరిశీలించి సెక్రటేరియట్ భద్రత బాధ్యతలు స్వాధీనం చేసుకోవాలని టీజీఎస్‌పీఎఫ్ డీజీని ఆదేశిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సెక్రటేరియట్ సెక్యూరిటీ బాధ్యతలను నాలుగు కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీసులకు అప్పగించారు. వారితో పాటు ఆక్టోపస్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో కూడిన క్విక్ రియాక్షన్ టీమ్ సెక్యూరిటీ వెలుపల భద్రత వ్యవహారాలకు అందుబాటులో ఉంటుంది. తాజా ఉత్తర్వులతో సెక్రటేరియట్ భద్రత బాధ్యతల నుంచి నాలుగు కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీసులు తప్పుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ పోలీసుల డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సిన ముఖ్యమంత్రిగా మొండిగా వ్యవహరిస్తుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారవర్గాలు చెప్తున్నాయి.