Telugu Global
Telangana

మహాలక్ష్మి ఎఫెక్ట్: కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు

తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా 3 వేల ఉద్యోగాల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు సజ్జనార్. కొత్త బస్సుల రాకతో కొత్త ఉద్యోగాల భర్తీ కూడా మొదలవుతుందని చెప్పారు సజ్జనార్.

మహాలక్ష్మి ఎఫెక్ట్: కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు
X

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల కుస్తీలు సర్వ సాధారణంగా మారాయి. సీట్లు దొరక్క పురుషులు ఆర్డినరీ బస్సులవైపు చూడటం మానేశారు. ఇక ఆటోడ్రైవర్ల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఉపాధి లేక ఆటో డ్రైవర్లలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరికొందరు డ్రైవర్ ఉద్యోగాన్నే మానేశారు, ఇంకొందరు ఆటోల కిస్తీలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. అయితే మహాలక్ష్మి పథకం వల్ల మంచి కూడా జరిగిందని అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీలో కొత్త కొలువులు భర్తీ చేస్తామంటున్నారు అధికారులు.

ఆర్టీసీ బస్సుల్లో గతంలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణించేవారని, మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య సగటున 55 లక్షలకు పెరిగిందని చెప్పారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌. రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 వేల కొత్త డీజిల్‌ బస్సులు, 990 ఎలక్ట్రిక్‌ బస్సులు త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కొత్త బస్సుల రాకతో కొత్త ఉద్యోగాల భర్తీ కూడా మొదలవుతుందని చెప్పారు సజ్జనార్.

తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా 3 వేల ఉద్యోగాల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు సజ్జనార్. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెడతామన్నారు. ఇటీవలే టీఎస్ఆర్టీసీ కాస్తా టీజీఎస్ఆర్టీసీగా పేరు మార్చుకుంది. లోగో విషయంలో జరిగిన రచ్చ తెలిసిందే. తాజాగా ఉద్యోగాల భర్తీ పేరుతో తెలంగాణ ఆర్టీసీ మరోసారి వార్తల్లోకెక్కింది.

First Published:  3 Jun 2024 8:11 AM IST
Next Story