Telugu Global
Telangana

తెలంగాణ ఆర్టీసీ బిల్లు విషయంలో ట్విస్ట్

ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో ముందుగా గవర్నర్ ఆమోదం తీసుకుని, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. రెండు రోజులుగా ఆ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపలేదు.

తెలంగాణ ఆర్టీసీ బిల్లు విషయంలో ట్విస్ట్
X

తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఆమోదం కూడా పూర్తయింది, బిల్లు రెడీ అయింది, ఆ బిల్లు గవర్నర్ టేబుల్ పై ఉంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. రెండు రోజులుగా ఆ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఈరోజు కాకపోయినా రేపయినా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారనుకుంటే పొరపాటే. ఒకవేళ ఇచ్చినా రేపటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. బహుశా ఇవే చివరి సమావేశాలు కావొచ్చు. ఈలోగా ఆ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలపకపోతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

గవర్నర్ కి ఎందుకు..?

తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ నుంచి అనుమతి రాలేదు. ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో ముందుగా గవర్నర్ ఆమోదం తీసుకుని, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. కానీ గవర్నర్ ఇంకా ఆమోదించలేదు, దీంతో ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టడంపై సందిగ్ధం నెలకొంది. బిల్లుని గవర్నర్ ఆమోదిస్తే, ఆ తర్వాత అసెంబ్లీలో లాంఛనంగా ఆమోద ముద్ర వేసి చట్టం రూపంలో తీసుకు రావాల్సి ఉంది.

ఎందుకీ ఆలస్యం..?

ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుని ఆమోదించే విషయంలో గవర్నర్ ఉద్దేశ పూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో విమర్శలు చేసిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా గవర్నర్ పలు బిల్లులను ఉద్దేశపూర్వకంగా తొక్కిపట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు నేతలు. ఇప్పుడూ కూడా గవర్నర్ టేబుల్ పై ఆర్టీసీ బిల్లు అలాగే ఆగిపోయిందని అంటున్నారు.

First Published:  4 Aug 2023 3:06 PM IST
Next Story