Telugu Global
Telangana

సందిగ్ధంలో ఆర్టీసీ బిల్లు.. వివరణ కోరిన గవర్నర్

ప్రభుత్వం తరపున సమాధానం పంపితే.. ఈరోజే గవర్నర్ పరిశీలించి బిల్లుని అసెంబ్లీకి పంపిస్తారా..? అసలీ సెషన్ లో బిల్లు ఆమోదం పొందుతుందా లేదా..? ఒకవేళ బిల్లు వ్యవహారం ఆలస్యమైతే.. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎన్నికల తర్వాతే ఉంటుందా అనేది తేలాల్సి ఉంది

సందిగ్ధంలో ఆర్టీసీ బిల్లు.. వివరణ కోరిన గవర్నర్
X

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తీసుకొచ్చిన బిల్లు వ్యవహారం మరింత సందిగ్దంలో పడింది. ఈరోజు అసెంబ్లీ చివరి రోజు కావడంతో గవర్నర్ ఆమోదం, అసెంబ్లీలో ఆమోదముద్ర తప్పనిసరి కాబోతోంది. ఈ దశలో గవర్నర్, ఆ బిల్లుపై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.

అర్థరాత్రి రాజ్ భవన్ ప్రకటన..

‘ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును గవర్నర్‌ క్షుణ్నంగా పరిశీలించారు. సందిగ్ధత ఉన్న కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరణ అవసరమని గవర్నర్‌ భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వివరణలతో కూడిన సమాధానం వెంటనే వస్తే.. బిల్లుపై గవర్నర్‌ త్వరగా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది.’ రాజ్ భవన్ ప్రకటన సారాంశం ఇది.

ఎందుకీ ఆలస్యం..?

ఆర్థిక బిల్లులకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి కావడంతో ఆర్టీసీ బిల్లు ముందు రాజ్ భవన్ కి వెళ్లింది. ఈనెల 2వతేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ముసాయిదా బిల్లు రాజ్ భవన్ కి చేరుకుంది. అయితే దీనిపై నిన్నటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గవర్నర్. ఈలోగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. రాజ్ భవన్ ని ముట్టడిస్తామంటూ ఆర్టీసీ కార్మికుల హెచ్చరికల నేపథ్యంలో అర్థరాత్రి ప్రకటన విడుదల కావడం విశేషం. ప్రస్తుతం గవర్నర్ తమిళిసై హైదరాబాద్ లో లేరని తెలుస్తోంది. మరి ఈ ప్రకటన ఉద్దేశమేంటి..? ప్రభుత్వం తరపున సమాధానం పంపితే.. ఈరోజే గవర్నర్ పరిశీలించి బిల్లుని అసెంబ్లీకి పంపిస్తారా..? అసలీ సెషన్ లో బిల్లు ఆమోదం పొందుతుందా లేదా..? ఒకవేళ బిల్లు వ్యవహారం ఆలస్యమైతే.. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎన్నికల తర్వాతే ఉంటుందా అనేది తేలాల్సి ఉంది. బిల్లు ఆలస్యంపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునివ్వగా, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ మాత్రం ఆందోళనలకు తమ మద్దతు లేదని తెలపడం గమనార్హం. ఒకవేళ బిల్లు ఆలస్యమైతే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని ఆ వర్గం అభ్యర్థిస్తోంది. మొత్తమ్మీద ఆర్టీసీ బిల్లు ఆమోదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

First Published:  5 Aug 2023 7:24 AM IST
Next Story