Telugu Global
Telangana

పెట్టుబడుల్లో మూడు రెట్ల వృద్ధిని నమోదు చేసిన తెలంగాణ

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.18,893.28 కోట్ల పెట్టుబడులు రాగా, 2022-23 ఆర్థిక సంవత్సరం రూ.49,579.18 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

పెట్టుబడుల్లో మూడు రెట్ల వృద్ధిని నమోదు చేసిన తెలంగాణ
X

2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ‌లో పెట్టుబడులు దాదాపు మూడు రెట్ల వృద్ధిని నమోదు చేశాయి.ఇది దేశంలోనే అత్యధికం.

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.18,893.28 కోట్ల పెట్టుబడులు రాగా, 2022-23 ఆర్థిక సంవత్సరం రూ.49,579.18 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

గత రెండు ఆర్థిక సంవత్సరాల TS-iPASS నివేదిక ప్రకారం, 2021-22లో 4,093 యూనిట్లు స్థాపించగా, గత ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేసిన‌ సంస్థల సంఖ్య 4,602కి పెరిగింది.కొత్తగా కేవలం 600 యూనిట్లు స్థాపించినప్పటికీ పెట్టుబడుల పరిమాణం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దీని ఫలితంగా గత సంవత్సరం కన్నా రూ.30,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెరిగాయి. .

అదేవిధంగా, పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. 2021-22లో, 1,01,035 మందికి ఉపాధి అవకాశాలను సృష్టించగా, 2022-23లో 1,02,105 మందికి ఉపాధి కల్పించారు.

గ్లోబల్ కార్పొరేట్ దిగ్గజాల నుండి ప్రముఖ దేశీయ తయారీదారుల వరకు అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఏప్రిల్ 2022లో, ఐటి మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో గూగుల్ సంస్థకు చెందిన అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించారు. అదే నెలలో, హైదరాబాద్‌కు చెందిన బిలిటి ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.

జూన్‌లో, గోల్డ్ రిటైలర్ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనుబంధ సంస్థ అయిన ఎలెస్ట్, రూ.24,000 కోట్ల పెట్టుబడులతో జనరేషన్ 6 అమోలెడ్ డిస్‌ప్లే FABని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి డిస్‌ప్లే ఫ్యాబ్ సౌకర్యం.

దేశంలోని అతిపెద్ద బంగారు, వజ్రాల రిటైల్ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, రూ.750 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో రత్నాలు, ఆభరణాల తయారీ యూనిట్‌కు పునాది రాయి వేసింది. ఇందులో 2,750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక, ఆటోమోటివ్ బ్యాటరీ సంస్థల్లో ఒకటైన అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, మహబూబ్ నగర్ జిల్లాలో 10 సంవత్సరాలలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ప్రకటించింది.

జనవరి 2023లో, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో రూ.16,000 కోట్ల పెట్టుబడితో తన డేటా సెంటర్ పెట్టుబడిని విస్తరిస్తున్నట్టు ప్రకటించింది.

First Published:  21 April 2023 4:25 AM GMT
Next Story