Telugu Global
Telangana

దేశంలోనే అత్యధిక గురుకులాలు.. విద్యారంగంలో తెలంగాణ రికార్డ్..

బీసీల కోసం 310 గురుకులాలు, స్టడీ సెంటర్లు, హాస్టళ్లు తెలంగాణలో ఉన్నాయి. వీటికి అదనంగా మరో 33 గురుకులాలు, 15 డిగ్రీ కాలేజీలు, మంజూరయ్యాయి.

దేశంలోనే అత్యధిక గురుకులాలు.. విద్యారంగంలో తెలంగాణ రికార్డ్..
X

ఉపాధి రంగంలో ఇప్పటికే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు అందనంత ఎత్తులో ఉంది. సాఫ్ట్ వేర్ అయినా, స్టార్టప్ లు అయినా.. తెలంగాణలో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇక విద్యారంగంలో కూడా మరో అరుదైన రికార్డ్ అందుకుంది తెలంగాణ. దేశంలో అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. బీసీల కోసం 310 గురుకులాలు, స్టడీ సెంటర్లు, హాస్టళ్లు తెలంగాణలో ఉన్నాయి. వీటికి అదనంగా మరో 33 గురుకులాలు, 15 డిగ్రీ కాలేజీలు, మంజూరయ్యాయి. బీసీ గురుకుల విద్యకోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటినుంచి ఇప్పటి వరకు రూ.2,979 కోట్లు కేసీఆర్ సర్కారు ఖర్చు చేసింది.

తెలంగాణ ఏర్పడే నాటికి నామమాత్రంగానే గురుకులాలు ఉన్నాయి. వాటి నిర్వహణ కూడా అంతంతమాత్రమే. అయితే తెలంగాణాలో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యాబోధన జరగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గురుకుల విద్యకు పెద్దపీట వేశారు. విద్య పరమైన అభివృద్ధి ద్వారానే బీసీ వర్గాలలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందనేది ఆయన ఆలోచన. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో మహాత్మా జ్యోతీరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీని 2014 జూలైలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

2014 నాటికి కేవలం 19 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా ఇప్పుడవి 310కి చేరాయి. వీటిలో 152 హైస్కూల్స్, 142 జూనియర్ కాలేజీలు, 16 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. 2023-24 నుండి 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ని జూనియర్ కాలేజీలుగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా 1,65,410 మంది విద్యార్థులు గురుకులాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. కొత్త జిల్లాలకు అదనంగా కాలేజీలు కేటాయిస్తున్నారు.

వసతులు మెండు..

గురుకుల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారు. యూనిఫాం, పుస్తకాలు, ఇతర సౌకర్యాలు ఉచితం. ఇంగ్లిష్ మీడియం బోధనతో పాటు కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థి కోసం ఏడాదికి 1.25 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. దీనికి తగ్గట్టే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు కూడా. బీసీ గురుకులాలకు సంబంధించి 2022 టెన్త్ క్లాస్ లో 97.53 శాతం, ఇంటర్ లో 93.84 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

హాస్టల్స్ కూడా..

రాష్ట్ర వ్యాప్తంగా 420 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 280 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు కూడా బీసీ విద్యార్థులకోసం అందుబాటులో ఉన్నాయి. 46,457 మంది విద్యార్థులు వీటిలో వసతి పొందుతున్నారు. 16 బీసీ స్టడీ సర్కిల్స్, 100 స్టడీ సెంటర్ల ద్వారా 1,25,000 మంది బీసీ యువతకు ఉద్యోగ ఉపాధి శిక్షణ కూడా అందిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీలకు విద్యా, ఉపాధి అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

First Published:  13 Sept 2022 6:40 PM IST
Next Story