Telugu Global
Telangana

జాతీయ ఆరోగ్య సూచీలో తెలంగాణకు మూడో స్థానం

తెలంగాణ ఏర్పడినప్పటినుంచి వైద్య, ఆరోగ్య శాఖలో సమూల మార్పులు తీసుకు రావడం, నిధుల పెంపు, కొత్త పథకాల అమలుతో.. ఆరోగ్య సూచీలో రాష్ట్రం మూడో స్థానం దక్కించుకుంది.

జాతీయ ఆరోగ్య సూచీలో తెలంగాణకు మూడో స్థానం
X

రాష్ట్ర విభజన అనంతరం ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి, వివిధ కంపెనీలు, స్టార్టప్ లు వచ్చాయి. అదే సమయంలో విద్యారంగంలో కూడా తెలంగాణ సాధించిన అభివృద్ధిని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటు వైద్య రంగంలో కూడా తెలంగాణలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. జాతీయ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానం కైవసం చేసుకుంది. ఈమేరకు ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆరోగ్య సబ్ సెంటర్ల నుంచి ప్రాథమిక, ఏరియా, జిల్లా, బోధన, రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సేవలను ప్రభుత్వం పటిష్టపరచడం ద్వారా ఈ ఘనత సాధించినట్టు తెలిపింది రాష్ట్ర ఆరోగ్య శాఖ. ప్రభుత్వ ఉచిత వైద్య సేవలు, టెస్ట్ లను విస్తృతం చేసేందుకు వ్యవస్థాపరమైన వసతుల అభివృద్ధి జరిగిందని, దీని ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు అధికారులు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మాతృమరణాల రేటు 92కాగా ఇప్పుడది 56కు తగ్గింది. శిశు మరణాల రేటు 39 నుంచి 21కి తగ్గింది. 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లల మరణాల రేటు 41 నుంచి 30కు తగ్గిందని, నవజాత శిశు మరణాల రేటు కూడా 25 నుంచి 17కి తగ్గిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం దేశంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య సూచిలో మూడో స్థానంలో నిలిచింది.

ఆరోగ్య రంగంలో ముఖ్యాంశాలు..

కేసీఆర్ కిట్ ద్వారా 2017 నుంచి ఇప్పటివరకు 13,29,951 మంది లబ్ధిపొందారు.

♦ 102 రిఫరల్ ట్రాన్స్‌ పోర్ట్ ద్వారా 41 లక్షల మంది గర్భిణులు రవాణా సదుపాయం పొందారు.

♦ పట్టణ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవల కోసం 259 బస్తీ దవాఖానాల ఏర్పాటు

♦ పేదలకోసం ఉచితంగా జిల్లాల్లో 20 టెస్టింగ్ ల్యాబ్స్, వీటి ద్వారా ప్రతి నెలా దాదాపు 4 లక్షల శాంపిల్స్ సేకరణ..

♦ 175 ఆస్పత్రుల్లో 10,170 పడకలతో సెకండరీ హెల్త్ కేర్ సేవలు

♦ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 లక్షలకుపైగా శస్త్రచికిత్సలు

♦ 57 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, 17 రక్త నిల్వ కేంద్రాల ద్వారా ఉచిత సేవలు

♦ వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపరిచేందుకు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌

♦ రూ.61కోట్ల అంచనా వ్యయంతో 29 బోధనాసుపత్రులు, 20 జిల్లా ఆసుపత్రులు, 30 ఆసుపత్రుల్లో వసతుల మెరుగుదల

♦ డైరెక్ట్ రిక్రూట్‌ మెంట్ ద్వారా 12,755 ఖాళీలను భర్తీ చేయడానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌ మెంట్ బోర్డ్ అనుమతి..

ఇవీ క్లుప్తంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సాధించిన విజయాలు. తెలంగాణ ఏర్పడినప్పటినుంచి వైద్య, ఆరోగ్య శాఖలో సమూల మార్పులు తీసుకు రావడం, నిధుల పెంపు, కొత్త పథకాల అమలుతో.. ఆరోగ్య సూచీలో రాష్ట్రం మూడో స్థానం దక్కించుకుంది.

First Published:  22 Sept 2022 5:46 PM IST
Next Story