Telugu Global
Telangana

మైనార్టీ బాలికల చదువు... తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్

మైనార్టీ బాలికల చదువు విషయంలో దేశంలోనే తెలంగాణకు మొదటి ర్యాంక్ వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో మైనార్టీ బాలికల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడమే దీనికి కారణం.

మైనార్టీ బాలికల చదువు... తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్
X

మహిళల చదువులో భారత దేశం వెనకబడే ఉంది. అందులోనూ మైనార్టీ మహిళల చదువు విషయంలో మరింత వెనకబడి ఉంది. జనాభాలో సగమైన స్త్రీలు చదువుకు దూరమైతే వారి కుటుంబాలకే కాదు దేశాభివృద్దికి కూడా తీరనినష్టం వాటిల్లుతుంతుంది. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం బాలికల చదువు విషయంలో ఎక్కువ శ్రద్ద చూపుతోంది. అందులోనూ మైనార్టీ బాలికల చదువు విషయంలో ప్రభుత్వం మరింత ముందు చూపుతో ఆలోచిస్తోంది. దానికి తగ్గ కార్యాచరణ విజయవంతంగా అవలంభిస్తోంది.

అందుకే మైనారిటీ బాలికల విద్యాభివృద్ధిలో తెలంగాణకు దేశంలోనే మొదటి ర్యాంక్ వచ్చింది. మైనార్టీల సంక్షేమం కోసమే కాక, ముఖ్యంగా చదువుకు ఆమెడ దూరంలో ఉన్న మైనార్టీ బాలకలకోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించింది.

రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.6,644 కోట్లు వెచ్చించింది. 2014లో తెలంగాణ ఆవిర్భవించినప్పుడు రాష్ట్రంలో మైనారిటీ గురుకులాల సంఖ్య 12 మాత్రమే. కానీ మైనార్టీలకు మరిన్ని విద్యావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. దాంతో మైనారిటీ గురుకులాల సంఖ్య 204కు పెరిగి, 1.14 లక్షల మంది విద్యార్థులు ఈ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. ఉచిత వసతి, భోజనంతోపాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తోంది.

మైనారిటీ బాలికలు చదువులో ముందుండాలనేది ప్రభుత్వ కోరిక కాబట్టి మైనారిటీ బాలికల కోసం ప్రత్యేకంగా 50 శాతం గురుకులాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం

పదవ‌తరగతి తర్వాత ఎక్కువ మంది మైనారిటీ బాలికలు చదువు మానేస్తున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 121 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. గతంలో పదవ తరగతి తర్వాత 18 శాతం మాత్రమే కాలేజీలకు వెళ్ళే మైనారిటీ బాలికలు నేడు 42 శాతానికి పెరిగారు.

రాష్ట్రంలోని 54 రెసిడెన్షియల్ మైనారిటీ గురుకులాలకు అన్ని సౌకర్యాలతో కొత్త భవనాల నిర్మాణం జరుగుతోంది. ఎన్నో సంప్రదింపుల తర్వాత హైదరాబాద్‌లో 29 కాలేజీ భవనాల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు వక్ఫ్ బోర్డు అంగీకరించింది. మిగతా వాటికి భూమి ప్రభుత్వం సమకూర్చుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్ని రంగాల్లో వారి అభివృద్ధికి కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. దీంతో మైనారిటీ బాలికల విద్యాభివృద్ధిలో తెలంగాణకు మొదటి ర్యాంక్ వచ్చిందని వారు చెప్పారు.

First Published:  30 July 2022 9:53 AM IST
Next Story