సౌరశక్తి రంగంలో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానం
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం సోలార్ ఎనర్జీ అభివృద్దిపై పూర్తి శక్తి వినియోగిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 4,511 మెగావాట్ల సోలార్, 128 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అధికారులు చెప్తున్నారు.
సౌరశక్తి రంగంలో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతే ఈ అభివృద్ది జరిగిందని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌ఆర్‌ఇడిసిఓ) ద్వారా తెలంగాణ 4,511 మెగావాట్ల సోలార్, 128 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని వారు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, సౌర, పవన శక్తిని పెంచడంతో పాటు సాంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనం, ఇంధన సంరక్షణ కార్యక్రమాలతో పాటు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ విధానాన్ని అమలు చేస్తోంది. పునరుత్పాదక ఇంధన కార్యక్రమం కింద, రాష్ట్రం ఇప్పటికే 4511.77 మెగావాట్ల సౌరశక్తిని సాధించింది.
విద్యుత్‌ను ఆదా చేసేందుకు పరికరాలను పంపిణీ చేయడమే కాకుండా డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ యాక్టివిటీ కింద ఎల్‌ఈడీ వీధిలైట్ల ఏర్పాటును కార్పొరేషన్ ఇప్పటికే చేపట్టింది. ఇది వాణిజ్య భవనాల కోసం ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌ను కూడా అమలు చేస్తోంది. అలాగే సౌర విద్యుత్తు గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తోంది.
విద్యుత్తు పొదుపు చర్యల వల్ల రాష్ట్రంలో 1005 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని అధికారులు పేర్కొన్నారు. ఆదా అయిన ఈ విద్యుత్ విలువ 3.30 లక్షల మెట్రిక్ టన్నుల చమురు శక్తికి సమానమని అధికారులు తెలిపారు.
అన్ని గ్రామ పంచాయతీల్లో అధిక విద్యుత్ వినియోగించే వీధి దీపాల స్థానంలో ఇంధన సామర్థ్య ఎల్‌ఈడీ వీధిలైట్లను అమర్చే కార్యక్రమం కూడా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంతో ఇంధన పొదుపులో దాదాపు 50 శాతం సాధించవచ్చని అంచనా.
స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీ-2020 ప్రకారం, మొదటి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు. మొదటి 5,000 యూనిట్ల నాలుగు చక్రాల వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు లభిస్తుంది.
రాష్ట్రంలో ఈ రంగంపై అంచనా వేసిన మొత్తం పెట్టుబడి దాదాపు రూ.30,000 కోట్లు. ఈ రంగంలో 1.2 లక్షల మంది ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ పాలసీ అమలుతో, కార్బన్ ఉద్గారాల తగ్గింపు 6.61 టెరా గ్రాముల (661 కోట్ల కిలోలు) వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వారు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 32,000 ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై ఉన్నాయి. ప్రస్తుతం 156 ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి, మరో 100 ఛార్జింగ్ స్టేషన్లు పురోగతిలో ఉన్నాయి. కార్పొరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్ షిప్ మోడల్‌లో సుమారు 1000 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు.