Telugu Global
Telangana

తెలంగాణలో భారీ వర్షాలు.. ఈరోజు, రేపు కూడా

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌ గల్‌ లో అత్యధికంగా 10.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో 5.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో భారీ వర్షాలు.. ఈరోజు, రేపు కూడా
X

ఇటీవలే భారీ వర్షాలు, వరదల నుంచి తేరుకున్న తెలంగాణలో శనివారం నుంచి మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నారాయణ పేట, నాగర్ కర్నూలు జిల్లాలకు మాత్రం వరుణుడి పలకరింపు లేదు. మిగతా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల జనజీవనం స్తంభించింది.

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌ గల్‌ లో అత్యధికంగా 10.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో 5.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల జనజీవనం స్తంభించింది,. ఆసిఫాబాద్‌ జిల్లాలో వాగులు పొంగిపొర్లడంతో కొన్ని ప్రాంతాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. జగిత్యాల జిల్లాలో కూడా భారీవర్షాలు కురిశాయి.

హైదరాబాద్‌ లో కూడా శనివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈరోజు రేపు కూడా వర్షాలు పడే అవకాశముందని, మంగళవారం వర్షాలు తగ్గుముఖం పట్టొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇటీవలి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆది, సోమవారాల్లో కూడా వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

First Published:  20 Aug 2023 6:58 AM IST
Next Story