ప్రియాంకను కూడా లాగుతున్నారా?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ప్రియాంకగాంధీ పోటీ చేయాలని తెలంగాణ నేతలు బాగా ఒత్తిడి తెస్తున్నారు. తమ డిమాండునే ప్రతిపాదన రూపంలో ఏఐసీసీకి పంపారు.
సెంటిమెంట్‌ను ప్రయోగించి కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన ప్రియాంకగాంధీని తెలంగాణ నేతలు రంగంలోకి లాగుతున్నట్లున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని బాగా ఒత్తిడి తెస్తున్నారు. తమ డిమాండునే ప్రతిపాదన రూపంలో టీ కాంగ్రెస్ ఏఐసీసీకి పంపిందని సమాచారం. ఈ ప్రతిపాదనను ఏఐసీసీ సీనియర్లు పరిశీలించారట. అయితే యధావిథిగా నిర్ణయాన్ని గాంధీ కుటుంబానికే వదిలేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో 1980లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దివంగత ప్రధాని ఇందిరాగాంధి మెదక్ నుండి పోటీ చేసిన విషయాన్ని పీసీసీ తన ప్రతిపాదనలో గుర్తుచేసింది. అప్పటి ఎన్నికల్లో ఇందిరకు 2 లక్షల ఓట్ల మెజారిటి వచ్చినట్లు చెప్పింది. మొదటి నుండి తెలంగాణపై ప్రియాంక ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్న కారణంగా తెలంగాణ నుండి పార్లమెంటుకు పోటీ చేయాలని నేతలు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణలో ప్రియాంక పోటీ చేస్తే పార్టీకి కలిసొస్తుందట. పీసీసీ నేతలు డిమాండ్ వరకు బాగానే ఉందికానీ ప్రియాంక పోటీ చేసినంత మాత్రాన పార్టీకి ఎలా కలిసి వస్తుందో అర్ధంకావటం లేదు.
ప్రస్తుతం పార్టీ నేతల్లో చాలామంది వివాదాలతో గొడవలు పడుతున్నారు. అయినదానికి కానిదానికి కూడా సంబంధంలేని నేతలు కూడా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజా ఉదాహరణ కొండా సురేఖ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదమే. కోమటిరెడ్డిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కొండా డిమాండ్ చేస్తున్నారు. కొండా వరంగల్ నేతయితే కోమటిరెడ్డి భువనగిరి జిల్లా నేత. అసలిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ ఇన్‌చార్జ్ థాక్రే నేతలందరినీ కలిసికట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునివ్వగానే కోమటిరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కొండా డిమాండ్ చేయటం పెద్ద వివాదంగా మారింది.
నేతల్లో చాలా మందికి ఒక్కళ్ళంటే మరొకళ్ళకు పడదు. ఈ నేపథ్యంలో ప్రియాంక మెదక్ నుండి పోటీ చేసినా గెలుపు గ్యారెంటీ ఇవ్వగలరా? గెలిస్తే ఓకే.. అలా కాకుండా ఓడిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు? నేతలందరి మధ్య మంచి సఖ్యత ఉండి ఏకతాటిపైన నడుస్తుంటే ఏమోలే అందరు కలిసి ప్రియాంకను గెలిపిస్తారేమో అని అనుకునే అవకాశముంది. మొత్తానికి ప్రియాంకను రంగంలోకి దింపుతున్నట్లే ఉంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.