ఎట్లుంది.. ఎట్లైంది.. పుస్తకం వచ్చేసింది
తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు ప్రజలకు చేరువైన తీరును గణాంకాలతో సహా ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు కేటీఆర్.
ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అభివృద్ధి అంశాలపైనే ఫోకస్ పెట్టింది. ప్రత్యర్థులను దెబ్బకొట్టాలంటే బీఆర్ఎస్ చేసినదేదో బలంగా చెప్పాలి. అందుకే ఇప్పుడు ఎట్లుంది.. ఎట్లైంది.. అనే ప్రచారం జోరందుకుంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇదే స్లోగన్ తో ఏకంగా ఓ పుస్తకం రూపొందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన ‘ప్రగతి ప్రస్థానం… ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ‘ప్రగతి ప్రస్థానం’ పుస్తకంగా వెలువరించిన సీనియర్ జర్నలిస్టు, సీఎం పీఆర్‌వో రమేష్ హజారీ కృషిని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేసిన పథకాలు, కార్యక్రమాలు, విధానాల ఫలితాలు తెలంగాణలోని గడప గడపకూ చేరాయని అన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచి, సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించాయని చెప్పారు. తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు ప్రజలకు చేరువైన తీరును గణాంకాలతో సహా ఈ పుస్తకంలో వివరించారని చెప్పారు కేటీఆర్. తెలంగాణ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మారింది.. అనే విషయాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం ఒక హ్యాండ్ నోట్ గా ఉపయోగపడుతుందని వివరించారు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సబ్జెక్ట్ అని అన్నారు కేటీఆర్.