Telugu Global
Telangana

ధరణి చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్‌

రాత్రికి రాత్రి స‌ర్కార్ భూములు ప్రైయివేట్ వ్యక్తుల చేతులు మారుతున్నాయ‌ని ఆరోపించడంతో, దీనికి కౌంట‌ర్ ఇవ్వాల‌ని అధికార పార్టీ సిద్ధమవుతోంది.

ధరణి చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్‌
X

తెలంగాణ‌లో ధ‌ర‌ణి పాలిటిక్స్ హీట్‌ పుట్టిస్తున్నాయి. ధర‌ణి లోపాల‌పై కాంగ్రెస్ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌కు రెఢీ అంటుంటే, అధికార పార్టీ ధ‌ర‌ణి ప్రయోజనాలపై చర్చకు సిద్ధం అంటోంది. భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వచ్చే ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు కీలక అస్త్రంగా మారనుంది. ఇప్పటి నుంచే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య ధరణి పోర్టల్‌ చుట్టూ మాటల యుద్ధం నడుస్తోంది.

తెలంగాణ‌లో హ్యాట్రిక్ కొట్టి మూడోసారి అధికారంలోకి రావాల‌ని బీఆర్‌ఎస్‌ తహతహలాడుతోంది. ఎన్నిక‌లు దగ్గర ప‌డ‌తుండ‌టంతో ప్రతిప‌క్షాల‌ను క‌ట్టడి చేసేందుకు అన్నీ అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్న అధికార పక్షానికి ధరణి లోపాలను ఎత్తిచూపుతూ అడ్డుకట్ట వేయాలనుకుంటోంది కాంగ్రెస్‌. ధరణితో తెలంగాణ ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్ళాయంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ధరణి పోర్టల్‌లో బ్రిటీష్ ఐల్యాండ్‌కు పెట్టుబడులు ఉన్నాయ‌ని, అది మంత్రి కేటీఆర్ మిత్రుడు గాదె శ్రీధర్ రాజు ప్రమేయంతో జరిగిందని ఆరోపించారు. ధ‌ర‌ణితో రాష్ట్రంలో ల‌క్షల ఎక‌రాలు మాయం అవుతున్నాయని, దీనిపై త్వరలోనే ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

ఎన్నిక‌లు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ ధరణి అంశాన్ని తెరమీదికి తేవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ధరణిలో రైతులు కొన్ని స‌మ‌స్యలు ఎదుర్కొంటున్నారు. ప్రోహిబిష‌న్ లిస్ట్, వార‌స‌త్వ భూముల రిజిస్ట్రేష‌న్‌ కొన్ని మాడ్యూల్స్ రైతుల‌కు, అధికారుల‌కు స‌వాల్‌గా మారింది. వీటిని పరిష్కరించేందుకూ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు కొత్త ఆరోపణతో ముందుకు వచ్చింది. ధరణి విదేశీయుల చేతిలో ఉందని రేవంత్‌ ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రి స‌ర్కార్ భూములు ప్రైయివేట్ వ్యక్తుల చేతులు మారుతున్నాయ‌ని ఆరోపించడంతో, దీనికి కౌంట‌ర్ ఇవ్వాల‌ని అధికార పార్టీ సిద్ధమవుతోంది. రేవంత్ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌కు కౌంటర్‌గా, ప‌వ‌ర్ ఫుల్ ప్రజెంటేష‌న్‌కు మంత్రి కేటీఆర్ సిద్దం అవుతున్నారు. ధరణి వచ్చాక భూ దందాల‌కు బ్రేక్ ప‌డింద‌ని, దీన్ని ప్రతిప‌క్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా ధరణిని ప్రవేశపెట్టడంపై తీవ్ర విమర్శలు చేస్తుంది. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని ఎత్తేస్తామని ఇప్పటికే బీజేపీ నేతలు పలుమార్లు ప్రకటించారు కూడా. ప్రతిపక్షాల దూకుడు సీఎం కేసీఆర్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇస్తూ వచ్చారు. ధరణిని తీసేస్తామనే వాళ్లని బంగాళాఖాతంలో కలపాలని పలు వేదికల మీద కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తానికి ధరణి చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి ప‌వ‌ర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్‌కు అధికార పక్షం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

First Published:  8 July 2023 11:00 AM IST
Next Story