Telugu Global
Telangana

సోనియా ఎంట్రీ.. సీపీఎంకి కాంగ్రెస్ బుజ్జగింపులు

సీపీఎం అభ్యర్థులను ప్రకటించినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బుజ్జగింపు ధోరణిలోనే ఉంది. ఒక్క సీటిస్తాం, గెలిచిన తర్వాత రెండు ఎమ్మెల్సీలిస్తామనే ప్రతిపాదన సీపీఎం ముందు ఉంచారు.

సోనియా ఎంట్రీ.. సీపీఎంకి కాంగ్రెస్ బుజ్జగింపులు
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం అన్ని శక్తుల్నీ కేంద్రీకరిస్తోంది. టీడీపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంది. వైఎస్సార్టీపీ, తెలంగాణ జనసమితిని పోటీలో లేకుండా చేసింది. సీపీఐని సింగిల్ సీటుకి పరిమితం చేసి, గెలిస్తే రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని సర్దిచెప్పింది. అయితే సీపీఎం మాత్రం వారి గేలానికి చిక్కలేదు. ఏకంగా 14మంది అభ్యర్థుల్ని ప్రకటించారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మరో ఐదుగురితో రెండో లిస్ట్ కూడా ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. ఈ దశలో ఇప్పుడు సోనియా గాంధీ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

సోనియా రాయబారాలు..

ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణలో కూడా ఆ కూటమి అలాగే ఉండాలని అంటున్నారు సోనియా గాంధీ. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఆమె నేరుగా ఫోన్ లో మాట్లాడారు. తెలంగాణలో కూడా తమతో కలసి నడవాలని, సహకరించాలని కోరారు. దీంతో సీతారాం ఏచూరి, రాష్ట్ర నాయకత్వానికి ఫోన్ చేసి మాట్లాడారు. కానీ కాంగ్రెస్ తో కలసి నడవలేమని తేల్చి చెప్పారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

వాస్తవానికి సీపీఎం 10 స్థానాలు కోరింది. కాంగ్రెస్ కుదరదనడంతో కనీసం రెండు స్థానాలు కావాలని పట్టుబట్టింది సీపీఎం. మిర్యాలగూడ, వైరా స్థానాలు సీపీఎంకి కేటాయించాలని కోరారు నేతలు. కానీ కాంగ్రెస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాలని చెప్పింది. ఈ ఆఫర్ నచ్చని తమ్మినేని వీరభద్రం చివరి నిమిషం వరకు వేచి చూశారు. ఆ తర్వాత ఏకంగా 14 మందితో లిస్ట్ రిలీజ్ చేశారు.

దింపుడు కళ్లెం ఆశలు..

సీపీఎం అభ్యర్థులను ప్రకటించినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బుజ్జగింపు ధోరణిలోనే ఉంది. ఒక్క సీటిస్తాం, గెలిచిన తర్వాత రెండు ఎమ్మెల్సీలిస్తామనే ప్రతిపాదన సీపీఎం ముందు ఉంచారు. దీనికి ఆ పార్టీ ఒప్పుకుంటే కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ అయినట్టు. లేకపోతే సీపీఎం అభ్యర్థులు బరిలో దిగిన చోట కాంగ్రెస్ కి అనవసర ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ వ్యతిరేక ఓటూ కూడా చీలక తప్పదు.

First Published:  6 Nov 2023 9:55 PM IST
Next Story