ఫైనల్ మ్యాచ్ చూద్దాం రండి.. యూత్‌కు అభ్యర్థుల గేలం
నగరంలోని పలు ఫంక్షన్ హాళ్లలో భారీ స్క్రీన్లు పెట్టించి, అక్కడే యూత్ అందరినీ పిలిచి మ్యాచ్ చూడటానికి ఏర్పాట్లు చేస్తున్నారు పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థులు.
అసలే ప్రపంచకప్ ఫైనల్.. అందునా ఇండియా ఫైనల్‌కొచ్చింది. కప్పు ఫేవరెట్ మనమే. పైగా వీకెండ్.. యూత్‌కు ఎంజాయ్ చేయడానికి ఇంతకు మించి ఇంకే సందర్భం కావాలి. అందుకే ఫాం హౌస్‌లు, శివార్లలోని రిసార్టుల్లో ఫైనల్ మ్యాచ్‌ను ఫ్రెండ్స్‌తో చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేయడానికి చాలామంది ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు ఎలాగైనా ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్న అభ్యర్థుల్లో చాలామంది యువత ఓట్లేయించడానికి దీన్నో అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు.
ఫంక్షన్ హాల్లో భారీ స్క్రీన్లు
ఫైనల్ మ్యాచ్ కాబట్టి మధ్యాహ్నానికే ప్రచారం ముగించేయడం బెటరని అభ్యర్థులంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకే నగరంలోని పలు ఫంక్షన్ హాళ్లలో భారీ స్క్రీన్లు పెట్టించి, అక్కడే యూత్ అందరినీ పిలిచి మ్యాచ్ చూడటానికి ఏర్పాట్లు చేస్తున్నారు పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థులు. మందు, స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాలనీ సంఘాల్లోనూ, యువజన సంఘాల్లోనూ గట్టిగా ఓట్లేయించగల నాయకులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేశారు. ప్రపంచకప్ లాంటి అరుదైన సందర్భంలో యువతను ఆకట్టుకోవడానికి ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచార వ్యవహారాలు చూస్తున్న నాయకుడొకరు చెప్పారు.
మీరు రాకపోతే ఇంటికే పంపిస్తామన్నా..
నడివయస్కులు, కాస్త పెద్దవారిని మందు పార్టీకి రమ్మంటే ఆ కుర్రాళ్లతో మేం గంతులేయలేమంటున్నారట. అందుకే కాలనీ సంఘాల భవనాల్లోనో, మీ ఇంట్లోనో పది మందీ కలిసి చూసుకోండి.. సందడిగా ఉండటానికి ఆ సరకూ సరంజామా మేమే సప్లయ్ చేస్తామంటున్నారు మరికొందరు అభ్యర్థులు. ముఖ్యంగా నగర శివార్లలోని నియోజకవర్గాలు ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్ వంటి నియోజకవర్గాల్లో ఈ సందడి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతుండగానే నాలుగు ఫంక్షన్‌హాళ్ల దగ్గరికి, యూత్ జమ కూడే చోటకి వెళ్లి వాళ్లతో కాసేపు సందడి చేయడంతోపాటు పనిలో పనిగా ఓట్లడుగుదామని మరికొందరు అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు.