వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలానాలపై మళ్లీ రాయితీ..!
2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో దాదాపు 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గతేడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు.
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలను వసూలు చేసేందుకు పోలీసు శాఖ మరోసారి రెడీ అవుతోంది. ఈసారి కూడా భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. గతేడాది రాయితీ ప్రకటించడంతో దాదాపు రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలయింది. ఇదే తరహాలో మరోసారి రాయితీలు ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
హైదరాబాద్ సిటీలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కేంద్రాల్లో చలానాలు విధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించడం సులువైంది. అయితే చాలా మంది చలానాలు చెల్లించడం లేదు. ఒక్కొ వెహికిల్‌పై పదుల సంఖ్యలో చలానాలు ఉంటున్నాయి.
2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో దాదాపు 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గతేడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. టూవీలర్స్‌కు 75 శాతం, మిగతా వెహికిల్స్‌కు 50 శాతం రాయితీ ఇవ్వడంతో మంచి స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల వరకు వసూలయ్యాయి. అప్పటికి పెండింగ్‌లో ఉన్న మొత్తం చలానాల్లో దాదాపు 65 శాతం చెల్లించారు. తర్వాత మళ్లీ పెండింగ్ భారం పెరిగిపోయింది. గత నెలాఖరు నాటికి మళ్లీ పెండింగ్ చలానాల సంఖ్య 2 కోట్లకు చేరుకుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు రాయితీలు ప్రకటించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.