పీసీసీ చీఫ్ మార్పు.. రేసులో ఉన్నది వీళ్లే..!
తెలంగాణలో దళితులు - రెడ్డి కలయికలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో భట్టి సీఎల్పీగా వ్యవహరించగా..రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందుగాని.. ఆ తర్వాతగాని పీసీసీ చీఫ్ మార్పు ఉండొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో ఉన్న బీసీ-రెడ్డి కాంబినేషన్‌ను మరోసారి తెరపైకి తీసుకువస్తున్నారు ఓ వర్గం నేతలు. 2004లో బీసీ లీడర్ డి.శ్రీనివాస్ పీసీసీ చీఫ్‌గా.. వైఎస్సార్ సీఎల్పీ లీడర్‌గా ఉండగా.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని కాంగ్రెస్ ఓడించింది. ఇక 2009లోనూ బీసీ-రెడ్డి కాంబినేషన్‌లో వరుసగా రెండోసారి కాంగ్రెస్ విజయం సాధించింది. ఇదే తరహాలో ఇప్పుడు బీసీ-కాంబినేషన్‌ను పలువురు నేతలు ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు.
బీసీ సామాజికవర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ లీడర్ వీహెచ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లాంటి నేతలు పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు.
టీపీసీసీ చీఫ్ పదవి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇవ్వాలని మరో వర్గం నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్న డి.కె.శివకుమార్ పీసీసీ చీఫ్‌గా ఉన్న విషయాన్ని ఉదహరిస్తున్నారు. తెలంగాణలో దళితులు - రెడ్డి కలయికలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో భట్టి సీఎల్పీగా వ్యవహరించగా..రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నారు.
రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా పలువురు నేతలు రేసులో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ఈ సామాజికవర్గం నుంచి బలంగా వినిపిస్తోంది. జగ్గారెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్ పదవి కోసం మంత్రులుగా ఉన్న భట్టి, పొన్నం, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగా డిమాండ్ చేయకపోయినప్పటికీ.. వారి అనుచరులు వాయిస్ వినిపిస్తున్నారు. అయితే మంత్రులుగా ఉన్నవారికి కాకుండా దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నవారిని గుర్తించి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు పీసీసీ చీఫ్‌ను మార్చొద్దని సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులైన కొందరు నేతలు ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖలు రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్‌ఫుల్‌గా పార్టీని నడిపించారని.. లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీని నడిపించేందుకు రేవంత్‌కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.