పటేల్ మా పార్టీ.. ఆయన్ని కూడా హైజాక్ చేస్తారా..?
ప్రధాన మంత్రి హోదాలో నెహ్రు ఆదేశిస్తేనే అప్పటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్, పోలీస్ చర్య చేపట్టారని గుర్తు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. తమ పార్టీ నేతని బీజేపీ హైజాక్ చేయడం ఏంటని నిలదీశారు.
విలీనం వర్సెస్ విమోచనం రాజకీయంలో బీజేపీ అందరికీ కార్నర్ అవుతోంది. నిజాం సంస్థానం భారత్ లో విలీనం అయిన సమయంలో అసలు బీజేపీయే పుట్టలేదని, అలాంటి పార్టీ ఇప్పుడు రాజకీయ లబ్ధికోసం తెలంగాణలో ఘర్షణ వాతావరణం సృష్టించాలని చూస్తోందని మండిపడుతున్నారు నేతలు. టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు.. బీజేపీపై ముప్పేట దాడి మొదలు పెట్టారు. నిజాం సంస్థానం విలీనానికి అసలు బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
పటేల్ ఏ పార్టీ..?
ప్రధాన మంత్రి హోదాలో నెహ్రు ఆదేశిస్తేనే అప్పటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్, పోలీస్ చర్య చేపట్టారని గుర్తు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. అసలు పటేల్ ఏ పార్టీ అని ప్రశ్నించారు. ఆయనకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని, తమ పార్టీ నేతని బీజేపీ హైజాక్ చేయడం ఏంటని నిలదీశారు హనుమంతరావు. నెహ్రూని ద్వేషించే బీజేపీ, అదే నెహ్రూ కేబినెట్ లో మంత్రి గా పనిచేసిన పటేల్ ని తమవాడిగా ఎలా చెప్పుకుంటుందని అన్నారు. పెరిగిన ధరలు, జీఎస్టీ గురించి దృష్టిమళ్లించడానికే బీజేపీ ఇలాంటి నాటకాలాడుతోందని చెప్పారు వీహెచ్. ఆఖరికి పాల మీద కూడా జీఎస్టీ వేస్తున్నారని మండిపడ్డారాయన.
సాయుధపోరాటంలో మీ స్థానమేంటి..?
సాయుధపోరాటంలో బీజేపీకి స్థానమే లేదని, అసలా పార్టీయే పుట్టలేదని, కానీ ఇప్పుడు సాయుధ పోరాటం చేసింది తామేనని వారు చెప్పుకుంటున్నారని విమర్శించారు హనుమంతరావు. సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా బీజేపీ వక్రీకరించిందని మండిపడ్డారు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా, సాయుధ పోరాటంపై చిత్తశుద్ది ఉంటే అమరుల కుటుంబాలకు సహాయం చేయాలని నిలదీశారాయన. వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు తమ్మినేని వీరభద్రం.