Telugu Global
Telangana

బహిరంగ వేలానికి తెలంగాణ ధాన్యం.. సీఎస్ ఉత్తర్వులు

ఈ ఏడాది వర్షాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రైస్‌ మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలను వేలం వేసేందుకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఆర్‌ డెలివరీ, ధాన్యం మిల్లింగ్‌ పై సమీక్ష నిర్వహించిన ఆమె, అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు.

బహిరంగ వేలానికి తెలంగాణ ధాన్యం.. సీఎస్ ఉత్తర్వులు
X

తెలంగాణ ధాన్యాన్ని బహిరంగ వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటు ఎఫ్.సి.ఐ సేకరించడం ఆపేసింది. నాణ్యత లేదంటూ తెలంగాణ ధాన్యంపై కొర్రీలు వేసింది. సేకరణకు నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యం వేలానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

నిల్వ ఉన్న ధాన్యం ఎంతంటే..?

తెలంగాణలో గడిచిన రెండు సీజన్లకు సంబంధించి కోటి టన్నులకు పైగా ధాన్యం నిల్వ ఉంది. త్వరలో వానాకాలం పంట కూడా చేతికి వస్తుంది. అంటే అదనంగా మరో కోటి టన్నులకుపైగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న కోటి టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రైస్‌ మిల్లుల్లో స్థలం లేదు. కొన్నిచోట్ల ధాన్యం బస్తాలను ఆరుబయటే ఉంచారు. వర్షాలు వస్తే ధాన్యం తడిచిపోవడం మినహా చేసేదేం లేదు. దీంతో రైస్ మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. త్వరలో మరింత ధాన్యం వస్తుందని, మర ఆడించడం సాధ్యం కావడంలేదని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని బహిరంగ వేలంలో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది వర్షాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రైస్‌ మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలను వేలం వేసేందుకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఆర్‌ డెలివరీ, ధాన్యం మిల్లింగ్‌ పై సమీక్ష నిర్వహించిన ఆమె, అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. వేలం ప్రక్రియ కోసం రాష్ట్ర స్థాయి కమిటీని కూడా నియమించారు. కమిటీ ఛైర్మన్‌ గా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. కమిటీలో సభ్యులుగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శి, టీఎస్‌ఐఐసీ ఎండీ, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ ఉంటారు. రాష్ట్రంలో ఎంత ధాన్యం నిల్వ ఉందో పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయిస్తుంది.

First Published:  10 Aug 2023 7:35 PM IST
Next Story