Telugu Global
Telangana

పోలవరం బ్యాక్ వాటర్‌పై మరోసారి సర్వే కోరిన తెలంగాణ

ఇటీవల గోదావరికి వరదలు వచ్చిన సమయంలో దాదాపు 28వేల మంది స్థానికులు, 11 వేల కుటుంబాలు, 3 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు తెలంగాణ అధికారులు గుర్తుచేశారు.

పోలవరం బ్యాక్ వాటర్‌పై మరోసారి సర్వే కోరిన తెలంగాణ
X

గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల కలిగే ప్రభావాన్ని మరోసారి అధ్యయనం చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)ని కోరింది. ఆ నీటి వల్ల టెంపుల్ టౌన్ భద్రాచలం ఏ మేరకు నష్టపోతుందో కూడా స్టడీ చేయాలని తెలిపింది. సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే గుప్త అధ్యక్షతన తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్‌గడ్ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మరోసారి పోలవరం బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయాలని తెలంగాణ అధికారులు కోరారు. గతంలో మ్యాథమెటికల్ మోడల్‌ను అనుసరించి వేసిన లెక్కలు సరిగా మ్యాచ్ కావడం లేదని అధికారులు తెలిపారు.

ఇటీవల గోదావరికి వరదలు వచ్చిన సమయంలో దాదాపు 28వేల మంది స్థానికులు, 11 వేల కుటుంబాలు, 3 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయినట్లు తెలంగాణ అధికారులు గుర్తుచేశారు. గతంలో వేసిన లెక్కలు పూర్తిగా తారుమారు అయ్యాయని వాళ్లు తెలిపారు. అలాగే పోలవరం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిన తర్వాత వెనుక ఉన్న గ్రామాలు, పట్టణాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా మరోసారి అధ్యయనం చేయాలని కోరారు. జూలైలో వచ్చిన వరదల వల్ల డ్రైనేజీలు కూడా నిండిపోయి, పొలాలు మునిగి పోయాయని గుర్తు చేశారు. 7 మండలాల్లోని 150 గ్రామాల పరిధిలో దాదాపు 50వేల ఎకరాల సాగు భూమి నీట మునిగిందని తెలంగాణ అధికారులు చెప్పారు.

అలాగే పోలవరం పైన ఉన్న ఉప నదులు, కాలువలు ఎలాంటి ప్రభావానికి గురవుతాయో కూడా మరోసారి సర్వే చేయాలని సీడబ్ల్యూసీని కోరింది. కాగా, గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ఉపనదులు, కాలువలపై జాయింట్ సర్వే చేయడానికి ఏపీ అధికారులు కూడా సుముఖ‌త వ్యక్తం చేశారు. మరోవైపు ఒడిశా, చత్తీస్‌గడ్ అధికారులు మాత్రం గోదావరి వరద ప్రవాహం 58 లక్షల క్యూసెక్కులుగా తీసుకొని సర్వే చేయాలని కోరారు. గతంలో ఐఐటీ-రూర్కీ కూడా ఈ విషయంపై అధ్యయనం చేసిన విషయాన్ని వాళ్లు గుర్తు చేశారు.

పోలవరం స్పిల్ వే, డ్యాం, బ్యాక్ వాటర్ ఎఫెక్ట్‌ను 58 లక్షల క్యూసెక్కుల బెంచ్ మార్క్ వద్ద అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏపీ ప్రభుత్వం చేసిన సర్వే మొత్తం కొన్ని పరిమితులతో కూడుకొని ఉన్నదని, పోలవరానికి అనుమతులు రావాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలను వదిలేశారని రెండు రాష్ట్రాల అధికారులు వ్యాఖ్యానించారు. ఈ సర్వే పూర్తి చేసే వరకు పబ్లిక్ హియరింగ్‌కు తాము ఒప్పుకోమని ఒడిశా అధికారులు తేల్చి చెప్పారు. మరోవైపు జాయింట్ సర్వేకు తాము వ్యతిరేకమని, సీడబ్ల్యూసీ సర్వేనే మాకు కావాలని కూడా స్పష్టం చేశారు.

First Published:  8 Oct 2022 7:10 AM IST
Next Story