17 నుంచి గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో ఈ నెల 17 వ తేదీ నుంచి 23 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలలో ఈ నెల 17 వ తేదీ నుంచి 23 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల పాటు జరిగే ఈ స్పెషల్ డ్రైవ్ లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక పారశుద్ధ్య కార్యక్రమంపై మంగళవారం ఆ శాఖ డైరెక్టర్ హన్మంతరావు, జిల్లాల పంచాయతి అధికారులతో సందీప్ కుమార్ సుల్తానియా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వర్షాకాలంలో ఎలాంటి అంటు వ్యాధులు రాకుండా ముందస్తుగా పారిశుద్ధ్య చేపట్టాలని ఆయన సూచించారు.
గ్రామాలలో ప్రతి రోజు రోడ్లు శుభ్రపరచాలని, గుంతలలో నీరు నిల్వ ఉండకుండా పూడ్చివేయాలన్నారు. పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు మురుగునీటి కాలువలు శుభ్రపరచాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా అన్ని రకాల పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్ స్థలాలు, బస్‌స్టాప్‌లు క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా అంటువ్యాధులు విజృంభించకుండా ఫాగింగ్, లార్వా అభివృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
గ్రామపంచాయతీలోని ప్రతి ఇల్లు శుక్రవారం డ్రై డేగా పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల సూచనలు, మార్గదర్శకాలు విధిగా పాటించి స్పెషల్ డ్రైవ్‌ను విజయ వంతం చేయాలని డీపీవోలకు సూచించారు. జిల్లా కలెక్టర్లు సమీక్షలు జరిపి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని కోరారు. వైకుంఠధామాలకు సోలార్ విద్యుత్ కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను ఆదేశించారు. వైకుంఠధామంలకు నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం సమకూర్చి వినియోగంలోకి తేవాలని కోరారు.