నా కుమార్తెను కూడా బీజేపీకి రమ్మన్నారు.. బీజేపీతో యుద్ధం చేయాల్సిందే- కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ నేతలకు బీజేపీ గాలం వేస్తున్న విధానంపై కేసీఆర్ కీలక విషయాలను బయటపెట్టారు. బీజేపీలోకి రావాల్సిందిగా నేతలకు గాలం వేస్తున్నారని కేసీఆర్ వివరించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ నేతలకు బీజేపీ గాలం వేస్తున్న విధానంపై కేసీఆర్ కీలక విషయాలను బయటపెట్టారు. బీజేపీలోకి రావాల్సిందిగా నేతలకు గాలం వేస్తున్నారని కేసీఆర్ వివరించారు. చివరకు తన కుమార్తె కవితను కూడా బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని.. ఇంత కంటే ఘోరం మరొకటి ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈడీ దాడులపై తిరగబడాలన్నారు. ఎక్కడ ఈడీ దాడులు చేస్తే అక్కడ టీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక అంశాలను సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికలు ఉండవని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉందని.. కాబట్టి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది నేటి నుంచి మొదలవ్వాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలంతా ఫీల్డ్‌లో ఉండాలన్నారు. క్యాలెండర్ తయారు చేసుకుని పని చేయాలని సూచించారు. ఎన్నికల ఏడాది మొదలైందన్నారు. మరీ అవసరం అయితే తప్ప నియోజకవర్గం నుంచి బయటకు రావొద్దన్నారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీతో ఇక యుద్ధమేనని సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని... అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అనవసరమైన వివాదాల్లోకి జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.
బీజేపీ సోషల్ మీడియాలో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని.. దాన్ని పార్టీ వైపు నుంచి ఎప్పటికప్పుడు గట్టిగా తిప్పికొట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గతం కంటే ఈసారి అధిక సీట్లలో టీఆర్‌ఎస్ గెలుపు సాధించి తీరాలన్నారు కేసీఆర్. ప్రతి వంద ఓటర్లకు ఒక ఇన్‌చార్జ్‌ను నియమిస్తామని ఈ పక్రియ కూడా వెంటనే చేపడుతామన్నారు.