కేసీఆర్ కృషి ఫలితంగానే తెలంగాణకు రికార్డ్ లు
అడిగినవన్నీ మనకు వెంటనే మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరేలా మనందరం కృషి చేయాలంటూ టీచింగ్ ఆస్పత్రుల సమీక్షలో సూచించారు మంత్రి హరీష్ రావు.
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే వైద్య రంగంలో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్నారు మంత్రి హరీష్ రావు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని చెప్పారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్ 1 గా నిలవడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని అన్నారు హరీష్ రావు. "పెద్ద మొత్తంలో బడ్జెట్ ఇచ్చారు, కొత్త మెడికల్ కాలేజీలు ఇచ్చారు, వైద్యుల నియామకాలు చేపట్టారు, వైద్య పరికరాలు ఇచ్చారు.." అడిగినవన్నీ మనకు వెంటనే మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరేలా మనందరం కృషి చేయాలంటూ ఆయన టీచింగ్ ఆస్పత్రుల సమీక్షలో సూచించారు.
తెలంగాణలో జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు హరీష్ రావు. 60 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో గత ప్రభుత్వాలు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. అతి తక్కువ సమయంలో మొత్తం 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. పెద్ద మొత్తంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, వైద్య సిబ్బందిని నియమిస్తూ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేస్తున్నామని వివరించారు. 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకంతో టీచింగ్ ఆసుపత్రులు మరింత బలోపేతమయ్యాయని అన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే వైద్యరంగంలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించిందని అన్నారు హరీష్ రావు. మాతృ మరణాల రేటు తెలంగాణ ఏర్పడే సమయానికి 92 గా ఉంటే ఇప్పుడు 43 కు తగ్గిందని చెప్పారు. బోధనాసుపత్రుల ఏర్పాటుతోపాటు, ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు హరీష్ రావు. మెడికల్ విద్యార్థుల స్టైఫండ్స్ పెంచామని, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని చెప్పారు. మెడికల్ కాలేజీల నిర్వహణ విషయంలో ఆదర్శంగా నిలవాలని అధికారులకు సూచించారు.