త్వరలో తెలంగాణకు కొత్త విద్యుత్ పాలసీ
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, 24 గంటల నిరంతర సరఫరా, గృహజ్యోతి పథకానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణలో విద్యుత్ పంపిణీకి సంబంధించి ఆరు గ్యారెంటీల్లో ఒక కీలక అంశం ఉంది. గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ అమలుకోసం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, అసెంబ్లీలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని అన్నారాయన. 24 గంటలపాటు నిరంతర విద్యుత్ ని అందించాల్సిందేనని తేల్చి చెప్పారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.
⚡త్వరలో కొత్త విద్యుత్తు పాలసీ
— Telangana CMO (@TelanganaCMO) January 10, 2024
⚡అసెంబ్లీలోనూ, నిపుణులతోనూ విద్యుత్తు విధానంపై విస్తృతంగా చర్చ
⚡24 గంటలపాటు నిరంతర విద్యుత్తును అందించాల్సిందే
⚡గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లకు ఏర్పాట్లు
⚡విద్యుత్తు శాఖపై ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula సుదీర్ఘ సమీక్ష
విద్యుత్తు రంగ… pic.twitter.com/MyRz835zT6
కొనుగోలు ఒప్పందాల సంగతేంటి..?
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందాలు, చెల్లించిన ధరలపై సమగ్ర నివేదికను కోరారు. ఎక్కువ ధర చెల్లించేలా కొనుగోలు ఒప్పందాలు జరిగితే, వాటి వెనుక ఉన్న అసలు కారణాలేమిటో కూడా నివేదికలో పొందుపరచాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం.
చౌకగా వస్తేనే కొనుగోలు..
ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తున్నారో లోతుగా పరిశీలించి.. వారి నుంచే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, 24 గంటల నిరంతర సరఫరా, గృహజ్యోతి పథకానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వపరంగా ఉత్పత్తి పెంచడానికి, మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.