Telugu Global
Telangana

ఆ ఇద్దరి కల నెరవేరింది..

వాస్తవానికి శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీలు కావాల్సి ఉన్నా.. అప్పటి గవర్నర్ తమిళిసై వారికి ఆ ఛాన్స్ లేకుండా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ వారిద్దర్నీ పక్కనపెట్టి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కి అవకాశం ఇచ్చింది.

ఆ ఇద్దరి కల నెరవేరింది..
X

ఎట్టకేలకు ఆ ఇద్దరి కల నెరవేరింది. ఆ ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసినా, చివరకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కథ ముగిసింది. ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్‌ అలీఖాన్‌ ఈరోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి వీరిద్దరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన ఎమ్మెల్సీలకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో గతంలో వారిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆ కార్యక్రమం వాయిదా పడింది. అంతలోనే తెలంగాణ హైకోర్టు అడ్డుపుల్ల వేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేయడంతో కోదండరాం, అమీర్ అలీఖాన్ కి చిక్కొచ్చింది. చివరకు ఈ చిక్కుముడిన సుప్రీంకోర్టు విప్పింది. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది.

అవకాశం జస్ట్ మిస్..

వాస్తవానికి శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీలు కావాల్సి ఉన్నా.. అప్పటి గవర్నర్ తమిళిసై వారికి ఆ ఛాన్స్ లేకుండా చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోపంతోనే తమిళిసై వారి నియామకాల్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ వారిద్దర్నీ పక్కనపెట్టింది. కొత్తగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కి అవకాశం ఇచ్చింది. చివరకు ఈ వ్యవహారం హైకోర్టు, సుప్రీంకోర్టు మధ్య తిరిగి తిరిగి ఇప్పటికి ముగిసింది.

First Published:  16 Aug 2024 6:26 AM GMT
Next Story