కొత్త సీఎంపై నిర్ణయం నేడే.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..?
తెలంగాణ కొత్త సీఎం ఎవరనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. కొత్త సీఎం ఎంపిక అనుకున్నతం ఈజీకాదు అనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఏకవాక్య తీర్మానంతో అధిష్టానానికే అన్ని బాధ్యతలు అప్పగించినా ఇంకా ఢిల్లీ నిర్ణయం ఏంటనేది తేలకపోవడం విశేషం. అంటే ఢిల్లీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్న నాయకులను బుజ్జగించడం ఇంకా సాధ్యం కాలేదనే విషయం స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ కుమ్ములాటలు..
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ వ్యవహారంపై బీఆర్ఎస్ సెటైర్లు పేల్చింది. సీఎం ఎంపికలోనే కాంగ్రెస్ చతికిలపడుతుందని, ఆరు గ్యారెంటీలేమో కాని, ఆరు నెలలకో సీఎం మారడం మాత్రం గ్యారెంటీ అని కౌంటర్లిచ్చారు నేతలు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. నిన్న రాత్రి 8.30 గంటలకు ప్రమాణ స్వీకారం అనే వార్తలొచ్చాయి. రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరిగాయి. సీన్ కట్ చేస్తే ఈరోజు ఇప్పటి వరకు సీఎం ఎవరనేది తేలలేదు. ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి ఢిల్లీలో కూడా తీవ్ర కసరత్తు జరుగుతోంది. రేవంత్ రెడ్డి పేరు కాస్త బలంగా వినపడుతున్నా.. ఈ సస్పెన్స్ ఎందుకో తేలడంలేదు. అంటే రేవంత్ ని వ్యతిరేకిస్తున్న వర్గం కూడా కాస్త బలంగానే తమ లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రమాణ స్వీకారం ఎప్పుడు..?
నిన్న సోమవారం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం బాగుందని అనుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ ముహూర్తం దాటిపోవడంతో ఈరోజు మంగళవారం ప్రమాణ స్వీకారం ఉండకపోవచ్చనే వార్తలు వినపడుతున్నాయి. ఈరోజు సీఎం నిర్ణయం ప్రకటించినా కూడా ప్రమాణ స్వీకారంపై మరో కచ్చితమైన సమయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తారు. ఒకవేళ సీఎం ఎంపిక ఈరోజు పూర్తి కాకపోతే.. సీఎం బాధ్యతల స్వీకరణ కూడా మరింత ఆలస్యం అవుతుంది.
♦