Telugu Global
Telangana

12మంది మంత్రులు.. స్వయంగా ఫోన్ చేసిన రేవంత్

1.04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఆరు గ్యారెంటీల ఫైల్ పై తొలి సంతకం చేస్తారు.

12మంది మంత్రులు.. స్వయంగా ఫోన్ చేసిన రేవంత్
X

తెలంగాణ నూతన మంత్రి వర్గంపై కూడా సందిగ్ధత వీడింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తూ 12మందిని కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. ఆ 12మందికి స్వయంగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభవార్త చెప్పడం విశేషం. సీఎంగా రేవంత్ తో పాటు ఆ 12 మంది కూడా ఈరోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఎవరా 12మంది..?

మంత్రులుగా 12మంది సీనియర్లను రేవంత్ రెడ్డి ఎంపిక చేసుకున్నారు.

మల్లు భట్టి విక్రమార్క

ఉత్తమ్ కుమార్ రెడ్డి

దామోదర రాజనర్సింహ

పొన్నం ప్రభాకర్

దుద్దిళ్ల శ్రీధర్ బాబు

సుదర్శన్ రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తుమ్మల నాగేశ్వరరావు

జూపల్లి కృష్ణారావు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సీతక్క

కొండా సురేఖ

10మంది పురుషులు, ఇద్దరు మహిళలకు తొలి విడత అవకాశమిచ్చి సామాజిక సమీకరణాలు పాటించారు. జిల్లాల వారీగా లెక్కలు తీస్తే..

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి అవకాశమిచ్చారు.

నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి అమాత్యయోగం లభించింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ

ఉమ్మడి కరీంనగర్‌ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌

మెదక్‌ జిల్లా నుంచి దామోదర్‌ రాజనర్సింహ

ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ నుంచి జూపల్లి కృష్ణారావుకి కేబినెట్ బెర్త్ లు ఖరారయ్యాయి.

డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కను ఖరారు చేశారు. మంత్రుల వివరాలను నేరుగా మీడియాకు విడుదల చేయలేదు. ఖర్గే, రేవంత్ రెడ్డి.. స్వయంగా ఫోన్లు చేసి వారికి అభినందనలు తెలిపారు. ఆయా నేతల ఇళ్ల వద్ద సందడి నెలకొనడంతో మంత్రుల వివరాలు బయటకు వచ్చాయి. కాబోయే మంత్రులు వివరాలను రాజ్‌ భవన్‌ కు రేవంత్‌ రెడ్డి తెలియజేశారు.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు సోనియాగాంధీ, రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ ముగ్గురూ హైదరాబాద్ చేరుకున్నారు. తాజ్ కృష్ణలో బస చేసిన వారు నేరుగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. ఇక దివ్యాంగురాలు రజినికి ప్రత్యేక ఆహ్వానం అందడం విశేషం. నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్‌ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజిని ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డిని కలసి తన బాధలు చెప్పుకున్నారు. పీజీ చదివిన తనకు ఎవరూ ఉద్యోగం ఇవ్వడంలేదని చెప్పారు. అప్పటికప్పుడు స్పందించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆమెకు తొలి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట గుర్తు పెట్టుకుని మరీ రజినిని తన ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచారు రేవంత్ రెడ్డి.

1.04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఆరు గ్యారెంటీల ఫైల్ పై తొలి సంతకం చేస్తారు.

First Published:  7 Dec 2023 11:34 AM IST
Next Story