Telugu Global
Telangana

రూమర్లకు చెక్ పెట్టిన ఎంపీ సంతోశ్ కుమార్

నేను ఒకప్పుడు సీఎం కేసీఆర్‌తో ఎలా ఉండేవాడినో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నా నాయకుడు, నాకు స్పూర్తి, నా జీవితానికి చుక్కాని లాంటి వారు మన సీఎం కేసీఆర్. అలాంటి వ్యక్తికి నేను ఎలా దూరం అవుతాను' అని సంతోశ్ చెప్పారు.

రూమర్లకు చెక్ పెట్టిన ఎంపీ సంతోశ్ కుమార్
X

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. సీఎం కేసీఆర్‌కు కుడి భుజంగానే కాకుండా.. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న సంతోశ్ కుమార్‌పై గత కొన్ని రోజులుగా అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సీఎం కేసీఆర్‌తో సంతోశ్ సంబంధాలు చెడిపోయాయని.. ఓ వ్యవహారంలో కేసీఆర్ గద్దించడంతో అలిగి ఎవ‌రికీ అందుబాటులో లేకుండా పోయారని ఓ పత్రిక కథనం ప్రచురించింది. సంతోశ్ కుమార్ ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరితో మాట్లాడటం లేదని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. కాగా, ఆ వార్తా కథనాన్ని సంతోశ్ పూర్తిగా ఖండించారు.

'నేను ఒకప్పుడు సీఎం కేసీఆర్‌తో ఎలా ఉండేవాడినో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నా నాయకుడు, నాకు స్పూర్తి, నా జీవితానికి చుక్కాని లాంటి వారు మన సీఎం కేసీఆర్. అలాంటి వ్యక్తికి నేను ఎలా దూరం అవుతాను' అని సంతోశ్ చెప్పారు. నేను ప్రగతి భవన్‌కు రావడం లేదని.. కేసీఆర్‌ను కలవడం లేదని వార్తలు వచ్చాయి. అవును గత కొన్ని రోజులుగా నేను ప్రగతిభవన్‌కు రాలేదు.నేను కూడా మనిషినే కదా? నాకు మాత్రం ఆరోగ్య సమస్యలు ఉండవా? నేను కూడా అలసిపోనా? రెండు రోజులు బయట కనపడకపోతే ఇలా రాసేస్తారా అని సంతోశ్ ప్ర‌శ్నించారు.

నాకు, సీఎం కేసీఆర్‌కు మధ్య ఉన్న బంధాన్ని భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా విడగొట్టలేడు. నేను ఎప్పటికీ కేసీఆర్ సేవకుడినే అని సంతోశ్ కుండబద్దలు కొట్టారు. ఆయన నాకు ఏ పని అప్పగించినా ఎంతో నిబద్దతతో పూర్తి చేస్తాను. అది నా కర్తవ్యంగా భావిస్తాను అని సంతోశ్ పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చిన్న చిన్న మనస్పర్థలు రావొచ్చు. కానీ అవి నాకు, సీఎం గారికి మధ్య విభేదాలు మాత్రం కావు అని స్పష్టం చేశారు. నన్ను చాలా మంది రాజకీయ నాయకుడు అంటారు. కానీ, నేను కేసీఆర్ సేవకుడినే. ఎవరు ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను అని సంతోశ్ వెల్లడించారు.

నా పని కేవలం సీఎం కేసీఆర్ ఇచ్చే టాస్క్‌ను పూర్తి చేయడం. ఆయన ఆదేశాలను పాటించడమే తప్ప మరొకటి కాదు. ఆయన లేకపోతే ఈ రోజు సంతోశ్ అనే వ్యక్తి తెలంగాణలో ఎవరికీ తెలియదు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. ఏ ఉద్యోగి అయినా అనారోగ్యంతోనో.. అలసటతోనో రెండు రోజులు కార్యాలయానికి రాకపోతే బాస్‌తో విభేదాలు ఉన్నట్లు కాదు అని సంతోశ్ స్పష్టం చేశారు. నేను ఎక్కడ ఉన్నా అంతిమంగా కేసీఆర్ అనుచరుడినే అని చెప్పారు.

First Published:  29 Sept 2022 1:25 AM GMT
Next Story