Telugu Global
Telangana

మొబిలిటీ వ్యాలీ ద్వారా 6 బిలియన్ల పెట్టుబడి.. 4 లక్షల మందికి ఉద్యోగాలు : మంత్రి కేటీఆర్

ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై అవగాహన పెంచడానికి ఈ-మెబిలిటీ వీక్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇండియాలోనే బెస్ట్ సిటీ అయిన హైదరాబాద్‌కు ఈ సమ్మిట్ వేదిక కావడం సంతోషకరమని మంత్రి కేటీఆర్ చెప్పారు.

మొబిలిటీ వ్యాలీ ద్వారా 6 బిలియన్ల పెట్టుబడి.. 4 లక్షల మందికి ఉద్యోగాలు : మంత్రి కేటీఆర్
X

హైదరాబాద్‌లో ఈ-మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని.. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఆరు బిలియన్ల పెట్టుబడి, 4 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ ఐసీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియాలోనే మొట్టమొదటి మొబిలిటీ వ్యాలీ తెలంగాణలోనే ఏర్పాటు అవుతోందని ఆయన స్పష్టం చేశారు. మొబిలిటీ వ్యాలీలో భాగంగా.. ఈ-మొబిలిటీ వీక్‌ను నిర్వహిస్తున్నారు. హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్ట్స్ హైదరాబాద్ సమ్మిట్ - 2023 కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి కేటీఆర్ అనేక విషయాలు వెల్లడించారు.

ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై అవగాహన పెంచడానికి ఈ-మెబిలిటీ వీక్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇండియాలోనే బెస్ట్ సిటీ అయిన హైదరాబాద్‌కు ఈ సమ్మిట్ వేదిక కావడం సంతోషకరమని మంత్రి చెప్పారు. ఏ విషయానికి అయినా వాతావరణాన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం అందరికీ అవసరం అన్నారు. అందుకే హైదరాబాద్‌లో ఈ-మొబిలిటీ ప్రోగ్రాం వీక్ నిర్వహిస్తున్నామని.. ఇందులో భాగంగానే తొలి ఫార్ములా ఈ-రేస్ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

సోలార్ ఎనర్జీ ఉత్పత్తిలో తెలంగాణ.. దేశంలోనే రెండో స్థానంలో ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఈ-చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఎవరైనా సంస్థలు పెట్టాలని నిర్ణయించుకుంటే.. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఆటోమోటివ్ సొల్యూషన్స్‌లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ రంగంలో ఎన్నో అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని.. అందుకే మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మోమిన్‌పేటలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే మరో నాలుగు మొబిలిటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎవరైనా వినూత్నమైన ఆలోచనలతో వచ్చినా, స్టార్టప్స్ ఏర్పాటు చేసినా వారికి తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఈవీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అమర్ రాజా గ్రూప్, హ్యుందాయ్ వంటి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని.. త్వరలోనే వాటి యూనిట్స్ ప్రారంభం కానున్నట్లు కేటీఆర్ చెప్పారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.


First Published:  6 Feb 2023 5:43 PM IST
Next Story