Telugu Global
Telangana

కిషన్ రెడ్డీ..! ఎందుకీ పొలిటికల్ డ్రామా..?

కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి అధికారికంగా వెళ్లి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు చూడవచ్చని అన్నారు మంత్రి తలసాని. కిషన్‌ రెడ్డి వస్తానంటే తానే కొల్లూరు తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపిస్తానన్నారు.

కిషన్ రెడ్డీ..! ఎందుకీ పొలిటికల్ డ్రామా..?
X

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది పొలిటికల్ డ్రామా అంటూ మండిపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ఇళ్ల దగ్గర బీజేపీ నేతల హడావిడి ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడయినా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించారా? అని తలసాని ప్రశ్నించారు. ఈరోజు ఉదయం నుంచి కిషన్‌ రెడ్డి డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవాలకు కిషన్‌ రెడ్డి, తాను కలిసి వెళ్లిన సందర్భాన్ని మంత్రి గుర్తు చేశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు బాగున్నాయని కిషన్ రెడ్డి చాలాసార్లు చెప్పారని కూడా గుర్తు చేశారు తలసాని.

బీజేపీ నేతల బాట సింగారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పర్యటన హైదరాబాద్ లో ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. కిషన్ రెడ్డి, రఘునందన్‌ రావు రోడ్డుపై బైఠాయించి మరింత సీన్ క్రియేట్ చేయబోగా.. వారిని అదుపులోకి తీసుకుని బీజేపీ ఆఫీసు వద్ద దింపేశారు. అయితే ఇదంతా కేవలం ప్రజల అటెన్ష్ కోసం బీజేపీ చేస్తున్న రాద్ధాంతం అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డి.. సీన్ క్రియేట్ చేసి తన ఉనికి చాటుకోవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి తలసాని.

కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి అధికారికంగా వెళ్లి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు చూడవచ్చని అన్నారు మంత్రి తలసాని. కిషన్‌ రెడ్డి వస్తానంటే తానే కొల్లూరు తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపిస్తానన్నారు. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు మాత్రమే ఇస్తోందని, మిగతా సొమ్ము రాష్ట్రానిదని స్పష్టం చేశారు. కేంద్రం కట్టిచ్చే ఇళ్లు అంటూ క్రెడిట్ మొత్తం వారే తీసుకోవాలని చూడటం సరికాదన్నారు.

First Published:  20 July 2023 3:42 PM IST
Next Story