అచ్చే దిన్ @2047.. మోదీపై కేటీఆర్ పంచ్ లు
2022 కి రైతుల ఆదాయం రెట్టింపుచేయడం కుదర్లేదని, దాన్ని 2047కి మార్చేశారా ఏంటి అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు కేటీఆర్. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన మోదీకి ఈ ప్రశ్నను సంధించారు.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. అయితే ఆయన మాటలకి విరుద్ధంగా రైతుల ఆదాయం రెట్టింపవలేదు కానీ, కష్టాలు మాత్రం రెట్టింపయ్యాయి. వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో ఖర్చులు పెరిగాయి. గిట్టుబాటు ధరల్లేక రైతులు విలవిల్లాడుతున్నారు. పీఎం కిసాన్ సాయం అందుతుందేమోనని ఎదురు చూస్తే.. కోతలు, వాతలతో లబ్ధిదారుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇక రైతుకి సంతోషం ఎక్కడ..? ఆదాయం రెట్టింపవడం ఏంటి..? మరి మోదీ ఇచ్చిన వాగ్దానం సంగతేంటి..? 2022 అంటూ మోదీ పెట్టిన టార్గెట్ పై సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్.
2047కి మార్చేశారా ఏంటి..?
2022 కి రైతుల ఆదాయం రెట్టింపుచేయడం కుదర్లేదని, దాన్ని 2047కి మార్చేశారా ఏంటి అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు కేటీఆర్. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన మోదీకి ఈ ప్రశ్నను సంధించారు. 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చిన మోదీకి దాన్ని ఓసారి గుర్తు చేస్తున్నానని అన్నారు. "2022 ఇంకో వారంలో వెళ్లిపోతుంది. మరి మీరు చేసిన వాగ్దానం 2047కి మారిపోయిందా. దానితోపాటు, అచ్చేదిన్ హామీ కూడా కూడా 2047కి షిఫ్ట్ అయిందా.. దయచేసి ఓసారి తెలియజేయండి" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
On #NationalFarmersDay2022 wanted to remind Hon'ble PM @narendramodi Ji of his famous promise of Doubling Farmers' income by 2022
— KTR (@KTRTRS) December 23, 2022
Sir, 2022 will be gone in a week. Please do let us know if the goalpost has been shifted to 2047 along with the promised Achhe Din pic.twitter.com/8TJVzdDDQa
గతంలో ఓసారి రైతుల ఆదాయం రెట్టింపైందంటూ ఓ ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది కేంద్రం. ఆ పోస్టర్ లో రైతుగా చూపిన వ్యక్తికి అసలు సాగుబడి అంటే ఏంటో తెలియదు. కేవలం ఫొటో షూట్ కోసమే వారిని పిలిపించినట్టు తర్వాత బయటపడింది. దీంతో ఆ ప్రచారం ఆపేశారు. ప్రచారంలో నటులను పెట్టడమే కాదు, అసలు ఆ ప్రచారమే పెద్ద నాటకం. మోదీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆదాయం రెట్టింపైంది, వారి సంతోషం రెండు రెట్లు పెరిగింది అంటే నమ్మేవారెవరూ లేరు. అన్నిటికీ కరోనా బూచిని చూపే కేంద్రం.. రైతుల కష్టాలకు కూడా కరోనా సాకుగా చెప్పేస్తోంది. అయితే 2022 టార్గెట్ ని మాత్రం వారు అధికారికంగా పొడిగించలేదు. కేటీఆర్ చెప్పినట్టు 2047 అంటారా..? లేక దగ్గర్లోనే మరో టార్గెట్ పెట్టుకుంటారా..? వేచి చూడాలి.