మోడీ వేస్తానన్న రూ. 15 లక్షలు ఎటు పోయాయో చెప్పిన కేటీఆర్
'ప్రతీ భారతీయుడు అకౌంట్లో వేస్తానన్న రూ. 15 లక్షలు ఒకే అకౌంట్‌లో డిపాజిట్ అయినట్లు ఉన్నాయని అనుకుంటున్నాను. అనుకోకుండా పొరపాటు జరిగిందా మోడీజీ' అంటూ కేటీఆర్ ట్వీట్
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ.. ప్రధాని పీఠంపై కూర్చోడానికి ఎన్నో మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో అతిపెద్ద అబద్దం తలా రూ. 15 లక్షలు అకౌంట్లో వేస్తానన్నదే. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతో అవినీతి జరిగిందని.. ఇండియా నుంచి లక్షల కోట్ల రూపాయల నల్లధనం స్విస్ బ్యాంకుల ఖాతాల్లోకి తరలిపోయిందని 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ పదే పదే చెప్పారు. అంతే కాకుండా.. బీజేపీని అధికారంలోకి తీసుకొని వస్తే.. తాను ఆ నల్లధనాన్ని మొత్తం తిరిగి ఇండియాకు తీసుకొని వస్తానని హామీ ఇచ్చారు. అలా తీసుకొచ్చిన నల్లధనంతో భారతీయులందరికీ తలా రూ. 15 లక్షలు అకౌంట్లో వేస్తానని ప్రామిస్ చేశారు. ఆ హామీ ఇచ్చి ఇప్పటికి ఎనిమిదేళ్లు గడించింది. రెండోసారి కూడా మోడీ ప్రధాని అయ్యారు. కానీ, రూ. 15 లక్షల ఊసే లేదు. ఏ ప్రతిపక్ష నాయకుడో .. మరొకరో ఆ రూ. 15 లక్షలు ఎప్పుడు వేస్తారని అడిగితే.. అసలు మోడీ అలాంటి హామీనే ఇవ్వలేదని బీజేపీ నేతలు దబాయిస్తారు.
మోడీ, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం విమర్శలు గుప్పించే తెలంగాణ మంత్రి కేటీఆర్.. తాజాగా ఈ రూ. 15 లక్షలు ఎటు పోయాయో తేల్చి చెప్పేశారు. ఎప్పుడూ తనదైన శైలిలో సెటైర్లు వేసే కేటీఆర్.. ఈ విషయంలో కూడా మోడీపై అదిరిపోయే ట్వీట్ చేశారు. గౌతమ్ అదానీ ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడిగా మారారు. ఆయన కంటే ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ మాత్రమే ఉన్నారు. బ్లూంబర్గ్ వార్తల ఆధారంగా ఫిబ్రవరిలో అదానీ నెట్‌వర్త్ రూ. 6.6 లక్షల కోట్లుగా తేల్చింది. ఎవరు చెప్పారు ఇండియా అభివృద్ధి చెందడం లేదని అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ ట్వీట్ చేశారు.
I guess all of that ₹15 lakh that was promised to every poor Indian got deposited into only one account
— KTR (@KTRTRS) August 31, 2022
Galti Se Mistake Modi Ji? https://t.co/aIuH8CbQ0k
ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కేటీఆర్ దానికి తనదైన వ్యాఖ్యానాన్ని జోడించారు. 'ప్రతీ భారతీయుడు అకౌంట్లో వేస్తానన్న రూ. 15 లక్షలు ఒకే అకౌంట్‌లో డిపాజిట్ అయినట్లు ఉన్నాయని అనుకుంటున్నాను. అనుకోకుండా పొరపాటు జరిగిందా మోడీజీ' అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అదానీ కేవలం ఆరేళ్లలోనే 206వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకారు. మోడీ ప్రభుత్వ హయాంలోనే అదానీ ఆస్తి పలు రెట్లు పెరుగుతూ వచ్చింది. కరోనా సమయంలో కూడా అత్యధిక ఆదాయం సంపాదించింది అదానీనే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే.. మోడీ అందరి రూ. 15 లక్షలూ ఒకరి అకౌంట్‌లోనే వేయడంతో అత్యంత ధనవంతుడిగా మారిపోయారనే రీతిలో సెటైర్ వేశారు.