ఎవరి ఆదాయం రెట్టింపైంది..? కేటీఆర్ మూడు ప్రశ్నలు..
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండంటూ కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ వేశారు.
దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిందంటూ కేంద్ర వ్యవసాయ శాఖ వేసిన ట్వీట్ పై కేటీఆర్ మూడు ప్రశ్నలు సంధించారు. అదే నిజమైతే ప్రధాని కార్యాలయం తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
కేటీఆర్ మూడు ప్రశ్నలు..
1) దేశంలో ఎంతమంది రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నారు?
2) ఆదాయం రెట్టింపు చేసుకున్న రైతులు ఎక్కడివారు, ఏ రాష్ట్రానికి చెందినవారు..?
3) ఈ ఘనత సాధించడానికి ప్రభుత్వం ఏం చేసింది..?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండంటూ కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ వేశారు.
ఆదాయం రెట్టింపులో నిజమెంత..?
దేశవ్యాప్తంగా అదానీ వంటి వ్యాపారవేత్తల ఆదాయం రెట్టింపవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏడేదికేడాది వారి సంపద భారీగా పెరుగుతున్నదనడానికి ప్రపంచ కుబేరుల జాబితాలో పైకి ఎగబాకుతున్న వారి స్థానాలే నిదర్శనం. ఆహార ధాన్యాలు, నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నాయనడానికి కూడా స్పష్టమైన ఆధారాలున్నాయి. మరి రైతుల సంగతేంటి..? రైతు ఆదాయం ఎక్కడ పెరిగింది..? ప్రకృతి సహకరించక, ఒకవేళ కాలం కలిసొచ్చి దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేక రైతు ఏడాదికేడాది బక్కచిక్కిపోతున్నాడు. మరి రైతులకు రెట్టింపు ఆదాయం ఎక్కడినుంచి వచ్చింది..? పోనీ వ్యవసాయ శాఖ వేసిన ట్వీట్ లో ఎంతమంది రైతులకు ఆదాయం పెరిగిందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేదు. "వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్" అంటూ గాలిలో లెక్కలు వేసింది. బాధ్యత గల ఓ సంస్థ ఓ విషయాన్ని హైలెట్ చేయాలనుకున్నప్పుడు కచ్చితంగా గణాంకాలు చెప్పాల్సిందే. కానీ ఇక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మాత్రం ఆ లెక్కలు చెప్పలేదు, కేవలం రైతులు రెట్టింపు ఆదాయం తెచ్చుకుంటున్నారని మాత్రమే సెలవిచ్చింది.
ఈ లెక్కలపైనే మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అదే నిజమైతే ఆ రైతులు ఎవరు, ఎక్కడుంటారు, ప్రభుత్వం ఏం చేయడం వల్ల వారి ఆదాయం పెరిగిందంటూ సూటిగా ప్రశ్నించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇలాంటి గ్రాఫిక్స్ బాగానే జనాల్లోకి వదులుతోంది. మోదీ భక్తులు చాలామంది అసత్యాలనే ధైర్యంగా ప్రచారం చేస్తుంటారు. పోనీ పార్టీ తరపున ఇలాంటి ట్వీట్ వేశారంటే.. ఏదో ప్రజాభిమానం కోసం కక్కుర్తి పడ్డారనుకోవచ్చు. కానీ ప్రభుత్వ విభాగం ఇలాంటి ట్వీట్ వేసిందంటే ఏమనుకోవాలి. అందుకే ఈ బాధ్యతా రాహిత్యాన్ని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. మరి కేటీఆర్ ప్రశ్నలకు వ్యవసాయ శాఖ కానీ, ప్రధాని కార్యాలయం కానీ జవాబు చెబుతాయో లేదో చూడాలి.