Telugu Global
Telangana

కేసీఆర్ వెనకడుగు వేసుంటే.. మనం ఉమ్మడి ఏపీలోనే ఉండే వాళ్లం: మంత్రి కేటీఆర్

సోషల్ మీడియాలో మాపై ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు. కానీ వాటిని మేము పట్టించుకోము. అలా పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమని కేటీఆర్ వివరించారు.

కేసీఆర్ వెనకడుగు వేసుంటే.. మనం ఉమ్మడి ఏపీలోనే ఉండే వాళ్లం: మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కనుక నీరసపడి, కాడి వదిలేసి వెనకడుగు వేసుంటే మనం ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండేవాళ్లమని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(డీఐసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

దేశంలో కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలు పెరిగిపోయాయని.. ఇక అగ్రవర్ణాల్లో అయితే ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి మరో న్యాయం జరుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సరైన పద్ధ‌తి కాదని.. దేశంలోని ప్రజలందరికీ సమాన న్యాయం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో మాపై ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తున్నారు. కానీ వాటిని మేము పట్టించుకోము. అలా పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమని కేటీఆర్ వివరించారు.

కాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై కొంత మంది తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఫ్రీ జోన్‌కు వ్యతిరేకంగా ఆనాడు సిద్దిపేట ఉద్యోగులు గర్జన కోసం పిలుపు ఇస్తేనే కేసీఆర్ బయటకు వచ్చి నిరసన తెలిపారని అంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు 14ఎఫ్ జీవో రద్దు కోసం రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్న సమయంలోనే కేసీఆర్ ఉద్యమంలోకి దిగారని గుర్తు చేస్తున్నారు. ఆనాడు కేటీఆర్ లేకపోయినా.. దీక్ష అని చెప్పి కేసీఆర్ నిమ్మరసం తాగితే ఓయూ విద్యార్థులు చేసిన ఆందోళన తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపు తెచ్చిందన్నారు.

కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని ఎవరూ తక్కువ చేయడం లేదని.. కానీ కేవలం కేసీఆర్ మాత్రమే చేశాడని.. ఆయన లేకపోతే ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేవాళ్ల మని చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడుతున్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది అమరులయ్యారని.. ఎల్బీనగర్ వద్ద శ్రీకాంతాచారి నిప్పంటించుకొని ఆత్మాహుతి అయిన విషయాన్ని అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.

First Published:  20 July 2022 4:21 PM IST
Next Story