Telugu Global
Telangana

అధికారం కాదు, బీజేపీకి మిగిలేది అంధకారమే

కరప్షన్ కు కెప్టెన్ మోదీ అని, క్యాప్షన్ బీజేపీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ అని, పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.

అధికారం కాదు, బీజేపీకి మిగిలేది అంధకారమే
X

చేవెళ్ల సంకల్ప సభలో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్లు పడ్డాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అమిత్ షా కి చాకిరేవు పెట్టారు. అమిత్ షా వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. బీజేపీ అధికారంలోకి రాదని, ఆ పార్టీ అంధకారం లోకి వెళ్తుందని సెటైర్లు వేశారు. ప్రధాని కుర్చీ ఖాళీగా లేదంటూ అమిత్ షా, కేసీఆర్ పై సెటైర్ వేయాలనుకుంటే.. దానికి కేటీఆర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. త్వరలో తెలంగాణలో బీజేపీ ఖాళీ అవుతుందని, ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ అవుతుందని చెప్పారు. వైఫల్యాల మోదీ గుజరాత్ కి ఘర్ వాపసీ అయిపోతారన్నారు.


మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే, దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అనే బలమైన భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉందని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసరగా.. అసలు బీజేపీ స్టీరింగే అదానీ చేతికి చిక్కిందని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం విలవిలలాడుతోందన్నారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో బీజేపీ ఫుల్ పిక్చర్ ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారని, ఇక దానికి సంబంధించి ట్రయిలర్లు అక్కర్లేదన్నారు.

పగటి వేషాలు.. పగటి కలలు

తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు ఇకపై నడవవని, ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవని చెప్పారు కేటీఆర్. ఈసారి ముక్కునేలకు రాసినా, మోకాళ్ల యాత్ర చేసినా బీజేపీ అధికారంలోకి రాలేదన్నారు. కరప్షన్ కు కెప్టెన్ మోదీ అని, క్యాప్షన్ బీజేపీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ అని, పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బీజేపికి మిగిలేది బూడిదే అని సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్.

First Published:  23 April 2023 10:30 PM IST
Next Story